వైసీపీ కార్యకర్తలు మరోసారి దారి తప్పుతున్నారు. రప్పా రప్పా.. నరుకుతాం! అని వ్యాఖ్యానిస్తూ.. షార్ట్ వీడియోలు రూపొందిం చి.. సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు. దీనిపై గుంటూరు, పిడుగురాళ్ల, నెల్లూరు, కడప జిల్లాల్లో పోలీసులు కేసులు నమో దు చేయడం సంచలనంగా మారింది. ఇటీవల ముగిసిన వినాయక నిమజ్జనాలను పురస్కరించుకుని వైసీపీ కార్యకర్తలు పెద్ద ఎత్తున మూగారు. నిజానికి కూటమి సర్కారు వచ్చిన తర్వాత.. సోషల్ మీడియాలో దారితప్పి వ్యాఖ్యలు చేస్తున్నవారిపై కేసులు పెడుతున్న విషయం తెలిసిందే. దీంతో చాలా మంది కార్యకర్తలు.. అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు.
ఇటీవల కేసుల హడావుడి తగ్గడంతోపాటు.. వినాయక నిమజ్జనాలు కూడా రావడంతో మళ్లీ వైసీపీ తరఫున చెలరేగి పోతు న్నారు. ఈ సందర్భంగా పార్టీల పేరుతో హడావుడి చేయడంతోపాటు.. ``మేం అధికారంలోకి వస్తే.. రప్పా.. రప్పా..నరుకుతాం`` అంటూ దుర్భాషలతో వీడియోలు రూపొందించారు. ముఖ్యంగా టీడీపీ నేతలను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. ఈ పరిణామాలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన డీజీపీ హరీష్ కుమార్ గుప్తా.. కేసులు నమోదు చేసి కారకులను అరెస్టు చేయాలని ఆదేశాలు జారీ చేశారు. దీంతో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న తాజా వీడియోలపై దృష్టి పెట్టిన సైబర్ క్రైమ్ పోలీసులు.. వారి కూపీ లాగుతున్నారు.
ఇలా.. పిడుగురాళ్ల, గుంటూరు, కడప జిల్లా లోని పలు నియోజకవర్గాల్లో యువత చేసిన వీరంగాలను గుర్తించారు. అనంతరం వారిపై కేసులు నమోదు చేశారు. ప్రస్తుతం 15 మంది వరకు నిందితులను అరెస్టు చేసినట్టు పోలీసు వర్గాలు పేర్కొన్నాయి. బెదిరింపులు, హెచ్చరింపులతో పాటు తీవ్ర దుర్భాషలతో రెచ్చిపోయిన వారిపై కఠిన చర్యలు తీసుకోనున్నట్టు తెలిపాయి. మరోవైపు.. ఈ పరిణామాలు రాష్ట్ర వ్యాప్తంగా దుమారం రేపుతున్నా.. వైసీపీ నాయకులు మాత్రం మౌనంగా ఉన్నారు. ఎవరు ఎలా పోయినా ఫర్లేదు.. అన్నట్టుగా తాడేపల్లి కార్యాలయం కూడా మౌనంగా ఉండడం గమనార్హం. దీంతో యువత తల్లిదండ్రులు లబోదిబోమంటున్నారు. తమ పిల్లలు చేసిన తప్పులు క్షమించాలని..రాజకీయాలకు దూరంగా ఉంచుతామని పేర్కొంటూ.. స్టేషన్ల చుట్టూ తిరుగుతున్నారు.