కేంద్ర మంత్రి నడ్డాకు సీఎం చంద్రబాబు ఫోన్ చేసిన సంగతి తెలిసిందే. చంద్రబాబు ఫోన్ చేయడంతో ఏపీకి 17,293 మెట్రిక్ టన్నుల యూరియాను కేంద్ర ప్రభుత్వం కేటాయించింది. దీంతో, రాష్ట్రంలో మొత్తం 80 వేల మెట్రిక్ టన్నుల యూరియా అందుబాటులో ఉంది. మరోవైపు, యూరియా కొరత నేపథ్యంలో ఈ రోజు వైసీపీ 'అన్నదాత పోరు' పేరిట రాష్ట్రవ్యాప్తంగా నిరసనలకు పిలుపునిచ్చింది. ఏపీలోని అన్ని జిల్లాల్లోని ఆర్డీవో కార్యాలయాల వద్ద రైతులు, రైతు సంఘాలతో కలిసి ధర్నాలు చేయాలని వైసీపీ నిర్ణయించింది. ఆ తర్వాత అధికారులకు వినతి పత్రాలు సమర్పించాలని వైసీపీ నిర్ణయించింది.
అయితే, ఈ కార్యక్రమానికి అనుమతి లేదని, 30 యాక్ట్ రాష్ట్రవ్యాప్తంగా అమల్లో ఉందని వైసీపీ శ్రేణులను పోలీసులు అడ్డుకుంటున్నారు. 30 యాక్ట్ అమల్లో ఉన్నందున ఎలాంటి సభలు, సమావేశాలకు అవకాశం లేదని పోలీసులు స్పష్టం చేశారు. ముందుజాగ్రత్త చర్యగా ఈ ఉదయం నుంచే రాష్ట్రవ్యాప్తంగా పలువురు వైసీపీ ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలను, కీలక నేతలను ఎక్కడికక్కడ పోలీసులు హౌస్ అరెస్టు చేస్తున్నారను. ఈ క్రమంలోనే పోలీసులకు, వైసీపీ శ్రేణులకు మధ్య ఘర్షణ వాతావరణం ఏర్పడింది. పోలీసులు అనుమతించకున్నా కార్యక్రమాన్ని నిర్వహించి తీరుతామని వైసీపీ శ్రేణులు చెబుతున్నాయి. దీంతో, ఏపీలోని పలు ఆర్డీవో కార్యాలయాల వద్ద పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.