ఏపీ, తెలంగాణతోపాటు దేశంలోని పలు రాష్ట్రాలలో యూరియా కొరత ఉన్న సంగతి తెలిసిందే. సరైన సమయానికి యూరియా లభ్యం కాకపోవడంతో రైతులంతా తీవ్ర ఆందోళన చెందుతున్నారు. యూరియా కోసం ఏపీతో పాటు పలు రాష్ట్రాలలో రైతన్నలు రోడ్డెక్కారు. ఈ క్రమంలోనే ఏపీలో యూరియా కొరతను సీఎం చంద్రబాబు తీర్చారు. ఈ వ్యవహారంపై నేరుగా రంగంలోకి దిగిన చంద్రబాబు కేంద్రంతో మాట్లాడి సమస్యను పరిష్కరించారు. కేంద్ర ఎరువులు, రసాయనాల శాఖ మంత్రి జేపీ నడ్డాకు చంద్రబాబు ఫోన్ చేసి మాట్లాడారు. కాకినాడ పోర్టుకు చేరుకోనున్న నౌక నుంచి తక్షణమే యూరియాను ఏపీకి కేటాయించాలని కోరారు.
చంద్రబాబు విజ్ఞప్తికి నడ్డా సానుకూలంగా స్పందించారు. ఏపీకి తక్షణమే 17,293 మెట్రిక్ టన్నుల యూరియాను కేటాయిస్తూ కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. చంద్రబాబు చొరవతో కేంద్రం నుంచి యూరియా కేటాయింపులు జరిగాయి. దీంతో, అధికారులను వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు అధికారులను అప్రమత్తం చేశారు. కేంద్రం కేటాయించిన యూరియాను యుద్ధప్రాతిపదికన అవసరమైన జిల్లాలకు తరలించాలని ఆదేశించారు. రైతులకు ఎలాంటి ఇబ్బంది రాకుండా చూడాలని ఆదేశాలు జారీ చేశారు. యూరియాను ఎవరైనా బ్లాక్ మార్కెట్‌కు తరలిస్తే కఠిన చర్యలు తప్పవని వార్నింగ్ ఇచ్చారు. ఏపీలో ప్రస్తుతం 80,503 మెట్రిక్ టన్నుల ఎరువుల నిల్వలు ఉన్నాయి.