ఆంధ్రప్రదేశ్ రాజకీయ చరిత్రలో 2023 సెప్టెంబర్ 9 ఒక టర్నింగ్ పాయింట్. సరిగ్గా రెండేళ్ల క్రితం మాజీ ముఖ్యమంత్రి, ప్రతిపక్ష నేత నారా చంద్రబాబును నంద్యాలలో పోలీసులు అరెస్టు చేశారు. స్కిల్ డెవలప్‌మెంట్ కేసు పేరిట జరిగిన ఈ అరెస్టు.. రాజకీయ ప్రతీకారానికి నిదర్శనం. నంద్యాలలో సెప్టెంబరు 8వ తేదీ రాత్రి `బాబు ష్యూరిటీ-భవిష్యత్ గ్యారెంటీ` కార్యక్రమంలో పాల్గొని తన బస్సులో సేదతీరేందుకు రెడీ అయిన చంద్రబాబుకు కంటి మీద కునుకు లేకుండా చేశారు. అప్పటి సీఐడీ డీఐజీ కొల్లి రఘురామరెడ్డి నేతృత్వంలోని పోలీసు బృందం బాబు బస వద్ద చేసిన హంగామా అంతా ఇంతా కాదు. ఫైనల్‌గా 9వ తేదీ తెల్లవారుజామున 6 గంటలకు చంద్రబాబును అరెస్టు చేశారు.
నంద్యాల నుంచి విజయవాడకు ప్రతిపక్ష నేతగా క్యాబినెట్ ర్యాంకులో ఉన్న బాబును 400 కిలోమీటర్లు రోడ్డు మార్గంలో తీసుకొచ్చారు. కోర్టు రిమాండ్ విధించడంతో ఆయన్ను రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించారు. అయితే చంద్రబాబు అరెస్టు వార్త వెలువడిన క్షణం నుంచి రాష్ట్రం ఉప్పొంగిపోయింది. రాత్రిపూట హడావుడిగా అరెస్టు చేయడం, ఆయనకు ప్రతిపక్ష నేతగా లభించాల్సిన గౌరవాన్ని ఇవ్వకపోవడం, జైల్లోనూ కనీస సౌకర్యాలు కల్పించకపోవడం.. ఇవన్నీ ప్రజల్లో ఆగ్రహాన్ని రగల్చాయి.
ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు వాసులు బాబు అరెస్ట్‌పై నిరసనలు వ్యక్తం చేశారు. ఐటీ ఉద్యోగులు హైదరాబాద్‌లో నిర్వహించిన భారీ సభ చరిత్రలో నిలిచిపోయింది. రాష్ట్రవ్యాప్తంగా మహిళలు వీధులపైకి వచ్చి జగన్ ప్రభుత్వంపై తమ ఆగ్రహం వ్యక్తం చేశారు. స్కిల్ డెవలప్‌మెంట్ కేసు పేరుతో బాబును అరెస్టు చేసినా, అసలు సాక్ష్యాలు ఎక్కడా చూపలేకపోయింది సీఐడీ. అధికారుల వాంగ్మూలాలు తారుమారు చేయడం, అవినీతి జరగకపోయినా జరిగిందని చూపించడం – ఇవన్నీ ప్రతీకార రాజకీయాల పరాకాష్ట అని ప్రజలు అర్థం చేసుకున్నారు.
హైకోర్టు బెయిల్ ఇవ్వడంతో 53 రోజుల తర్వాత చంద్రబాబు 2023 అక్టోబరు 31న జైలు నుంచి విడుదలయ్యారు. అయితే చంద్రబాబు అరెస్టు కేవలం ఒక రాజకీయ ప్రతీకార చర్య మాత్రమే కాదు, వైసీపీ పతనానికి బీజం వేసిన సంఘటనగా కూడా మారింది. చంద్రబాబు జైలులో ఉన్నప్పుడే జనసేన అధినేత పవన్ కల్యాణ్ ముందుకు వచ్చి టీడీపీతో కలసి పోటీ చేస్తానని ప్రకటించారు. ఇది రాజకీయ సమీకరణాలను పూర్తిగా మార్చేసింది. ఆ తర్వాత బీజేపీ కూడా జతకలవడంతో మూడు పార్టీల కూటమి పటిష్టమైంది.
జగన్ ప్రభుత్వం పాలనలో విఫలమైనా, అసలు పతనానికి ట్రాక్ పడింది మాత్రం చంద్రబాబు అక్రమ అరెస్టు. అదే సంఘటన ప్రజల్లో విపరీతమైన సానుభూతిని, ప్రతిఘటనను రగిలించింది. ప్రజల మనసుల్లో నాటుకున్న ఆ అన్యాయం భావన చివరికి ఓటు రూపంలో వెలువడింది. 2019లో 151 సీట్లు గెలిచిన వైసీపీ, 2024లో కేవలం 11 సీట్లకే పరిమితమైంది. లోక్‌సభలో 25 సీట్లలో 4 మాత్రమే గెలిచింది. టీడీపీ–జనసేన–బీజేపీ కూటమి 175 అసెంబ్లీ స్థానాల్లో 164 సీట్లు సాధించి అధికారికంలోకి వచ్చింది. ఫైనల్‌గా చంద్రబాబు అరెస్టు జగన్‌కు తాత్కాలిక రాజకీయ లాభాలు తెచ్చివుండవచ్చు కానీ, అదే నిర్ణయం వైసీపీకి శాశ్వతమైన నష్టాన్ని మిగిల్చింది అన్నది వాస్తవం.