గానగంధర్వుడు.. ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం కుమారుడు, ప్రముఖ గాయకుడు ఎస్పీ చరణ్‌కు బెదిరిపులు ఎదురయ్యారు. నానా దుర్భాషలాడుతూ.. ఆయనను చంపేస్తానంటూ.. తమిళ సినీ పరిశ్రమకు చెందిన ఓ సహాయ దర్శకుడు బెదిరించాడు. దీంతో చరణ్.. ఈ వ్యవహారంపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. తక్షణ మే చర్యలు తీసుకోవాలని, తనకు రక్షణ కల్పించాలని ఫిర్యాదులో విజ్ఞప్తి చేశారు. దీంతో కేసు నమోదు చేసిన పోలీసులు.. విచారణ చేపట్టారు.
ఏం జరిగింది?
ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం.. జీవించి ఉన్న రోజుల్లో చెన్నై శివారులోని.. సాలిగ్రామం అనే ప్రాంతంలో ఉన్న ఓ గార్డెన్‌లో అపార్ట్‌మెంటు ఫ్లాట్‌ను కొనుగోలు చేశారు. దీనిని బాలునే ఎక్కువగా వినియోగించుకునే వారు గెస్ట్ హౌస్‌గా ఆయన వినియోగించినట్టు తెలిసింది. అయితే.. బాలు మరణానంతరం.. ఈ ఫ్లాట్‌ను.. ఆయన కుమారుడు ఎస్పీ చరణ్ అద్దెకు ఇచ్చారు. తమిళనాట మంచి పేరున్న సహాయ దర్శకుడు తిరుజ్ఞానంకు నెలకు 40000 రూపాయల అద్దె ప్రాతిపదికన ఈ ఫ్లాట్‌ను ఇచ్చారు.
అయితే, రెండేళ్లుగా తిరుజ్ఞానం అద్దె చెల్లించకపోగా.. ఫోన్ కూడా లిఫ్ట్ చేయడం లేదని.. ఎప్పుడు ఇంటికి వెళ్లినా.. తాళం వేసి ఉంటోందని చరణ్ చెబుతున్నారు. ఈ క్రమంలో ఓ రోజు తెల్లవారుజామున కాపు కాసి.. తిరుజ్ఞానంను పట్టుకుని ప్రశ్నించినట్టు తెలిపారు. దీంతో తిరుజ్ఞానం మద్యం మత్తులతో తనను దూషించడమే కాకుండా .. అద్దె అడిగితే.. చంపేస్తానని బెదిరించినట్టు చెప్పారు. ఈ వ్యవహారంపై జోక్యం చేసుకుని తనకు రావాల్సిన అద్దె సొమ్మును ఇప్పించడంతోపాటు.. తిరుజ్ఞానంను ఖాళీ చేయించాలని ఆయన పోలీసులకు ఫిర్యాదు చేశారు.
సినీ పరిశ్రమ సంఘీభావం
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వ్యవహారంపై తమిళనాడు చిత్ర పరిశ్రమ విస్మయం వ్యక్తం చేసింది. దీనిని అంతర్గతంగా చర్చించి సమస్యను పరిష్కరిస్తామని.. పరిశ్రమకు చెందిన పెద్దలు ఎస్పీ చరణ్‌కు హామీ ఇచ్చారు. అయితే.. తనకు డబ్బులు ఇప్పించడంతోపాటు.. తిరుజ్ఞానంను ఖాళీ చేయించాలన్న విషయంపై హామీ ఇవ్వలేదని.. చరణ్ చెబుతున్నారు. అందుకే.. తాను పోలీసులను ఆశ్రయించాల్సి వచ్చిందని అంటున్నారు. మరి దీనిపై పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకుంటారో చూడాలి.