మలయాళీలకు ఓనం పండుగ ప్రత్యేకమైనది. ఓనం అంటే ఆనందం, ఆత్మీయత, సంప్రదాయం కలయిక. ఈ పండుగలో ప్రతి మగువ సిగన కనిపించేవి మల్లెపూలు. ఓనం సందర్భంగా అమ్మాయిలు తలలో మల్లెలు ధరించడం సంప్రదాయం. అది కేవలం అందం కోసం కాదు, పండుగకు తగిన శుభతను ఆహ్వానించే ఒక ఆచారం. అయితే ఆ మల్లెపూలే ఇప్పుడు ఓ నటికి పెద్ద తంటా తెచ్చిపెట్టాయి. కేరళ అందాల తార నవ్య నాయర్ ఓనం పండుగ కోసం ఆస్ట్రేలియాకు వెళ్ళి, ఊహించని అనుభవం ఎదుర్కొన్నారు.
సాధారణంగా మన దగ్గర ఆచారం, పండుగలో భాగమై అందంగా కనిపించే మల్లెపూలు, ఆస్ట్రేలియాలో మాత్రం ఆమెకు భారీ జరిమానా తెచ్చిపెట్టాయి. ఆస్ట్రేలియాలోని మలయాళీ అసోసియేషన్ ఆఫ్ విక్టోరియా ఘనంగా ఓనం వేడుకలు నిర్వహించింది. అందులో పాల్గొనడానికి నవ్య నాయర్ ప్రత్యేక ఆహ్వానం మేరకు మెల్‌బోర్న్ వెళ్లారు. కానీ మెల్‌బోర్న్ విమానాశ్రయంలో దిగగానే నవ్యకు ఊహించని షాక్ తగిలింది.
బ్యాగ్ చెక్‌లో అధికారులకు మల్లెపూలు కనిపించాయి. పూలు అంటే మనకు భావోద్వేగం, కానీ అక్కడ అది జీవ వైవిధ్యానికి ముప్పు. బయోలాజికల్ ఐటమ్స్‌ను కఠినంగా నిషేధించే ఆస్ట్రేలియా.. వెంటనే నవ్య నాయర్ కు రూ.1.14 లక్షల ఫైన్ వేసింది. అనంతరం ఈ విషయాన్ని ఆమె అక్కడ జరిగిన బహిరంగ కార్యక్రమంలో పంచుకున్నారు. `ఆస్ట్రేలియా వచ్చే ముందు నా కోసం నాన్న మల్లెపూలు తెచ్చారు. వాటిలో కొన్నింటిని తలలో పెట్టుకున్నా, మరికొన్నింటిని హ్యాండ్‌బ్యాగ్‌లో పెట్టుకున్నా. అది తప్పు అని నాకు తెలియదు. పొరపాటునే జరిగింది` అని నవ్య వివరించారు. ఇకపోతే అధికారులు నవ్య నాయర్ 28 రోజుల్లోపు జరిమానా చెల్లించాలని నోటీసు ఇచ్చారు. మొత్తానికి చిన్నపాటి సంప్రదాయం ఎంతటి పెద్ద సమస్యగా మారుతుందో ఈ సంఘటన మరోసారి గుర్తు చేసింది.