తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి భారీ రిలీఫ్ దక్కింది. ఆయనపై నమోదైన కేసును కొట్టి వేస్తూ.. సు ప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బీఆర్ గవాయ్ నేతృత్వంలోని ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసిం ది. రాజకీయ పరమైన వివాదాల్లో తాము జోక్యం చేసుకునేది లేదని తేల్చి చెప్పింది. ఇదేసమ యంలో కోర్టులను రాజకీయ యుద్ధాలకు కేంద్రాలుగా మార్చుకునే వారిని కట్టడి చేస్తామని హెచ్చరించింది. ``ఈ కేసులో ఏముంది..? మీ రాజకీయ ప్రయోజనం తప్ప. ఇలాంటి వాటిని కట్టడి చేస్తాం`` అని కోర్టు వ్యాఖ్యానించింది.
ఏంటీ కేసు?
గత ఏడాది జరిగిన సార్వత్రిక ఎన్నికల సమయంలో మహబూబ్‌నగర్‌లో నిర్వహించిన కాంగ్రెస్ పార్టీ బహిరంగ సభలో సీఎం రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం మరోసారి వస్తే.. దేశ రాజ్యాంగాన్ని మార్చేస్తారని అన్నారు. అంతేకాదు.. ఎస్సీ, ఎస్టీ, మైనారిటీల హక్కులను కూడా తుంగలో తొక్కుతారని.. స్వేచ్ఛలేకుండా చేస్తారని, భావప్రకటనకు సంకెళ్లు వేస్తారని అన్నారు. అయితే.. ఈ వ్యాఖ్యలపై బీజేపీ నేతలు కేసులు పెట్టారు. అప్పట్లోనే నమోదైన ఈ కేసులు సంచలనం సృష్టించాయి.
అయితే.. పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకోలేదు. దీంతో రాష్ట్ర బీజేపీ నాయకులు హైకోర్టును ఆశ్రయిం చారు. కేసు పెట్టి.. చర్యలు తీసుకునేలా ఆదేశించాలని కోరారు. అయితే.. హైకోర్టు మాత్రం బీజేపీ నేతలు దాఖలు చేసిన పిటిషన్‌ను కొట్టి వేసింది. దీనిలో ఎలాంటి దురుద్దేశం లేదని.. ఇవి రాజకీయ పరమైన అంశాలని పేర్కొంది. ఇలాంటి వాటిని విచారిస్తూ.. పోతే.. కోర్టులకు ఏళ్ల తరబడి సమయం పడుతుందని వ్యాఖ్యానించింది. దీంతో బీజేపీ నాయకులు.. సుప్రీంకోర్టును ఆశ్రయించారు. తాజాగా సుప్రీంకోర్టు కూడా.. సదరు పిటిషన్‌ను కొట్టి వేస్తూ.. తీవ్ర వ్యాఖ్యలు చేసింది.