నువ్వు మొండి అయితే నేను జగమొండి. నువ్వు నీ అగ్రరాజ్య బలాన్ని ఆయుధంగా మారిస్తే.. నేను నా బుద్ధిబలాన్ని ప్రదర్శిస్తా.. అన్నట్లుగా భారత ప్రధాని నరేంద్ర మోడీ వ్యవహరిస్తున్నారు. షెడ్యూల్ ప్రకారం చూస్తే.. ఈ నెల 23 నుంచి 29 మధ్య అమెరికాలో జరిగే ఐక్యరాజ్య సమితి సర్వప్రతినిధి సమావేశానికి భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ హాజరు కావాల్సి ఉంది. ఈ సందర్భంగా ఆయన సమితి వేదిక మీద నుంచి ప్రసంగించాల్సి ఉంది.
ఈ వార్షిక సమావేశానికి ఒక ప్రత్యేకత ఉంది. అదేమంటే.. ఈ సారి జరుగుతున్నది 80వ జనరల్ అసెంబ్లీ సమావేశం.
ఈ సమావేశ ఆనవాయితీ ప్రకారం తొలుత బ్రెజిల్.. ఆ తర్వాత అమెరికా దేశాధినేతలు ప్రసంగించాల్సి ఉంటుంది. రెండోసారి అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన ట్రంప్ ఈ నెల 23న ఐక్యరాజ్య సమితి జనరల్ అసెంబ్లీని ఉద్దేశించి మాట్లాడతారు. జులైలో విడుదల చేసిన జాబితా ప్రకారం సెప్టెంబరు 26న భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రసంగిస్తారంటూ షెడ్యూల్ విడుదల చేశారు. తాజాగా విడుదల చేసిన జాబితాలో మాత్రం ప్రధాని మోడీకి బదులుగా భారత విదేశాంగ మంత్రి జైశంకర్ ప్రసంగిస్తారని పేర్కొన్నారు.
దీంతో.. ఈ నెల చివరి వారంలో అమెరికా పర్యటకు వెళ్లాల్సిన నరేంద్ర మోడీ.. తన టూర్ ను క్యాన్సిల్ చేసుకున్నారని చెప్పాలి. తాజా నిర్ణయం అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఈగోను మళ్లీ మోడీ టచ్ చేసినట్లుగా చెప్పాలి. మిత్రుడు కాస్తా మొండితనంతో వ్యవహరిస్తే తాను జగమొండిలా వ్యవహరిస్తానన్న విషయాన్ని తన పర్యటన రద్దుతో ట్రంప్ నకు అర్థమయ్యే సందేశాన్ని మోడీ పంపినట్లు అయ్యిందని చెప్పాలి.
మిగిలిన దేశాధినేతల మాదిరి భారత ప్రధాని నరేంద్ర మోడీని డీల్ చేయటం సాధ్యం కాదన్న విషయం తాజా పరిణామంతో మరసారి ట్రంప్ కు అర్థమయ్యేలా చేస్తారని చెప్పాలి. అగ్రరాజ్య అధినేతగా తనకు ఒదిగి ఉండాలని కోరుకునే ట్రంప్.. భారత ప్రధాని నుంచి ఇటీవల కాలంలో వస్తున్న స్పందనలు ఆయనకు మరింత నిరాశ కలిగించేలా మారుతుందని చెప్పాలి. తన అమెరికా టూర్ ను రద్దు చేసుకోవటం ద్వారా ప్రపంచానికి ప్రధాని మోడీ బలమైన సందేశాన్ని ఇచ్చినట్లే.
ప్రపంచంలో అత్యంత ఎక్కువ జనాభా ఉన్న భారతదేశం తన నిర్ణయాల్ని తాను స్వతంత్ర్యంగా స్వేచ్ఛగా తీసుకుంటుందే తప్పించి.. ఒకరి ఒత్తిడికి తగ్గే ప్రసక్తే లేదన్న సందేశాన్ని ఇచ్చారు. అగ్రరాజ్య అధికారాన్ని తమ మీద ప్రయోగిస్తానంటే..దాన్ని భరించేందుకు తాము సిద్ధంగా లేమని మోడీ స్పష్టం చేసినట్లుగా చెప్పాలి. ట్రంప్ కు ఎలా అయితే తన దేశ ప్రయోజనాలు ముఖ్యమో.. అదే విధంగా ట్రంప్ నకు ఒకనాటి సన్నిహిత మిత్రుడైన నరేంద్ర మోడీ కూడా తన దేశ ప్రయోజనాలే తప్పించి.. అగ్రరాజ్య అధినేత ఆడిందే ఆట.. పాడిందే పాట అన్నట్లు చేస్తే తాను ఒప్పుకోని తాజా చర్యతో తేల్చేశారు.
ప్రపంచ వేదిక మీద మాట్లాడే అవకాశం మోడీ వద్దనుకోవటం ద్వారా జరిగే నష్టంతో పోలిస్తే.. అమెరికా అధ్యక్షుడికి అర్థమయ్యే భాషలో నిర్ణయంతో జరిగే లాభమే ఎక్కువన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. మోడీ తీసుకున్న పర్యటన రద్దు నిర్ణయంతో భారత్ ను తేలిగ్గా తీసుకోలేమన్న సంకేతాన్ని వైట్ హౌస్ కు మరింత బాగా అర్థమవుతుందని చెప్పాలి. ఒత్తిడికి లొంగదనే విషయాన్ని స్పష్టం చేస్తుంది.
ఈ తీరు అమెరికాకు ఒకలాంటి ఇబ్బందిని కలిగిస్తుందని చెప్పాలి. ఒకప్పుడు తాను చెప్పిన విషయాల్ని బుద్దిగా వింటూ ఉండే మిత్రుడు.. ఇప్పుడు అందుకు భిన్నంగా తామిప్పుడు భారత్ ను కంట్రోల్ చేయలేని పరిస్థితుల్లో ఉన్నామన్న దుగ్ధను అమెరికాకు కలిగించటంలో మోడీ విజయవంతం అయ్యారని చెప్పక తప్పదు.