సందీప్ రెడ్డి వంగ.. ఇప్పుడు ఇండియాలో మోస్ట్ వాంటెడ్ డైరెక్టర్లలో ఒకడు. తన సినిమాలకే కాదు ఇంటర్వ్యూలకు కూడా విపరీతమైన డిమాండ్ ఉంది. అతను ఏ కార్యక్రమంలో పాల్గొన్నా కళ్లప్పగించి చూస్తారు యూత్. అలాంటిది రామ్ గోపాల్ వర్మ లాంటి మంచి మాటకారి, విచిత్రమైన పర్సనాలిటీతో కలిసి వంగ.. జగపతిబాబు టాక్ షో జయమ్ము నిశ్చయమ్మురా కార్యక్రమానికి హాజరయ్యాడు. వర్మ ఇప్పుడు ఏ స్థితిలో ఉన్నప్పటికీ.. ఆయన ఒకప్పుడు తీసిన సినిమాలకు వంగ పెద్ద ఫ్యాన్. వర్మ తనను ఎంతగా ఇన్‌స్పైర్ చేశాడో తరచుగా చెబుతూనే ఉంటాడు వంగ.
ఈ టాక్ షోలో సైతం వర్మపై తన అభిమానాన్ని మరోసారి చాటుకున్నాడు ఈ సెన్సేషనల్ డైరెక్టర్. ఆర్జీవీ తనకు ఎన్నో విషయాల్లో గురువు అని సందీప్ పేర్కొన్నాడు. వర్మ సినిమాలు చూసి తనకు తెలియని ఎన్నో విషయాలు తెలుసుకున్నట్లు చెప్పాడు. తాను అత్యధికసార్లు చూసిన సినిమా వర్మ తీసిన సత్యనే అని.. 50-60 సార్లు ఆ సినిమా చూసి ఉంటానని.. తాను ఎడిటింగ్ నేర్చుకున్నది ఈ సినిమా చూసే అని సందీప్ వెల్లడించాడు.
ఇక రాజమౌళి తనపై చూపించిన ప్రభావం గురించి కూడా సందీప్ వంగ మాట్లాడాడు. బాహుబలి: ది కంక్లూజన్ ఇంటర్వెల్ తనకు విపరీతంగా నచ్చిందని వంగ తెలిపాడు. దాన్ని మించిన ఇంటర్వెల్ తాను చూడలేదని అతను చెప్పాడు. ఒక సినిమాకు ఇంటర్వెల్ కూడా చాలా ముఖ్యమని ఆ సినిమా చూసే అర్థం చేసుకున్నానని వంగ తెలిపాడు.
బాహుబలి-2 ఇంటర్వెల్ చూశాక తన స్టూడియోకు వచ్చి అర్జున్ రెడ్డి ఇంటర్వెల్ ఎపిసోడ్ చూశానని.. ఇది ప్రేక్షకులకు నచ్చుతుందా అని భయపడ్డానని అతను చెప్పాడు. ఐతే ట్రైలర్ రిలీజయ్యాక ప్రేక్షకుల నుంచి వచ్చిన రెస్పాన్స్ చూసి తనకు ధైర్యం వచ్చిందని సందీప్ చెప్పాడు.
ఇక ప్రభాస్‌తో తీయబోయే స్పిరిట్ గురించి ఒక ఆసక్తికర విషయం పంచుకున్నాడు సందీప్. తాను తన సినిమాల షూట్ కంటే ముందు బ్యాగ్రౌండ్ స్కోర్ వర్క్ చేయించేస్తుంటానని.. దాని వల్ల సినిమా తీయడం ఈజీ అవుతుందని.. యానిమల్ సినిమాకు 80 శాతం బీజీఎం పూర్తయ్యాక చిత్రీకరణ మొదలైందని.. స్పిరిట్ విషయంలోనూ ఇలాగే చేస్తున్నానని.. ఇప్పటిదాకా 70 శాతం ఆర్ఆర్ అయిపోయిందని సందీప్ వెల్లడించాడు. ప్రభాస్ లాంటి పెద్ద స్టార్‌తో సినిమా చేయడం ఎలా ఉంటుందో అనుకున్నానని.. అతను స్వీట్ పర్సన్ అని.. త్వరలోనే స్పిరిట్ షూట్ మొదలుపెడతామని సందీప్ తెలిపాడు.