చదువుకున్న యువతకు ప్రపంచవ్యాప్తంగా పలు దేశాలు ఉద్యోగావకాశాలు కల్పిస్తున్నాయి. అయితే, జర్మనీ, ఫ్రాన్స్ వంటి దేశాలలో పని చేయాలంటే స్థానిక భాష నేర్చుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది. దీంతో, విదేశాలలో ఉద్యోగాలు చేయదలచిన యువత ఆయా విదేశీ భాషలు కూడా నేర్చుకుంటున్నారు. అయితే, ఇకపై ఇటువంటి ఇబ్బందులకు చెక్ పెట్టేందుకు విద్యా శాఖా మంత్రి నారా లోకేశ్ వినూత్న ఆలోచనకు శ్రీకారం చుట్టారు. ఇకపై, యువతకు చదువుతో పాటు విదేశీ భాషల్లో శిక్షణనిచ్చేలా ఏర్పాట్లు చేయబోతున్నామని ఆయన తెలిపారు.
సీడాప్ (CDAP) ద్వారా శిక్షణ పొందిన పలువురు యువతులు జర్మనీలో ఉద్యోగాలు పొందిన నేపథ్యంలో వారిని లోకేశ్ అభినందించారు. గ్రామీణ ప్రాంతాల యువత సైతం అంతర్జాతీయ స్థాయిలో రాణించాలన్న ఉద్దేశ్యంతో సీడాప్ కార్యాచరణ చేపట్టామని, రాబోయే ఐదేళ్లలో 50 వేల మందికి విదేశీ ఉద్యోగాలు కల్పించడమే లక్ష్యంగా పెట్టుకున్నామని అన్నారు. ఐదేళ్లలో 20 లక్షల ఉద్యోగాల సృష్టికి ప్రణాళికాబద్ధంగా కృషి చేస్తున్నామని చెప్పారు.
సీడాప్ ద్వారా యువతకు విదేశాల్లో ఉద్యోగాలు దక్కేలా శిక్షణ ఇచ్చే వ్యవస్థను బలోపేతం చేస్తున్నామని అన్నారు. ఇకపై చదువుతో పాటు జర్మన్, జపనీస్, ఫ్రెంచ్ వంటి విదేశీ భాషల్లో కూడా శిక్షణ అందించబోతున్నామని తెలిపారు. తద్వారా గ్రామీణ యువతకు విదేశాల్లో ఉద్యోగ అవకాశాలు మెరుగుపడతాయని, మరింత విస్తృతమవుతాయని చెప్పారు.