వైసీపీ అధికారంలో ఉన్న ఐదేళ్లూ అమరావతిపై విషం చిమ్మిన సంగతి తెలిసిందే. కోట్లాది రూపాయల ప్రజాధనం వృథా అవుతుందని తెలిసినా సరే అమరావతిలోని ప్రభుత్వ భవనాల నిర్మాణాలను అర్థాంతరంగా ఆపేసిన ఘనత మాజీ సీఎం జగన్ ది. అమరావతి రాజధాని నిర్మాణం కూడా ఒక అల్టిమేటంగా జరిగిన 2024 అసెంబ్లీ ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం విజయ దుందుభి మోగించింది. అమరావతి రాజధాని కావాలని ఆంధ్రులు ఇచ్చిన తీర్పు తర్వాత కూడా వైసీపీ నేతలకు కనువిప్పు కలగలేదు. కనీసం ప్రతిపక్ష హోదా దక్కనప్పటికీ అమరావతిపై దుష్ప్రచారం మాత్రం వైసీపీ నేతలు ఆపలేదు. అమరావతి మునిగిపోయిందని కొందరు...అక్కడ భవనాల నిర్మాణ పనులు ఆగిపోయాయని ఇంకొందరు విష ప్రచారం చేస్తున్నారను. ఈ నేపథ్యంలోనే వైసీపీ నేతలకు మంత్రి నారాయణ కౌంటర్ ఇచ్చారు.
ఏసీ గదుల్లో కూర్చొని అమరావతిపై తప్పుడు ప్రచారం చేసేవారిపై నారాయణ మండిపడ్డారు. ఏసీ రూముల్లో కూర్చొని ఇష్టం వచ్చినట్లు మాట్లాడడం కాదని, అమరావతికి వచ్చి చూస్తే ఏ పనులు జరుగుతున్నాయో అర్థమవుతుందని వైసీపీ నేతలకు నారాయణ చురకలంటించారు. నేలపాడులో జరుగుతున్న గెజిటెడ్ ఆఫీసర్ల భవనాల నిర్మాణ పనులను పరిశీలించిన తర్వాత కాంట్రాక్టర్లతో నారాయణ భేటీ అయ్యారు. నిర్మాణ పనులు, మౌలిక వసతుల ఏర్పాట్లను వేగవంతం చేయాలని కాంట్రాక్టర్లకు, నిర్మాణ సంస్థల ప్రతినిధులకు ఆయన చెప్పారు.
అమరావతి మునిగిపోయిందని కొందరు దుష్ప్రచారం చేస్తున్నారని, అలా అబద్ధాలు చెప్పినవారిని ప్రజలే ఛీ కొడతారని అన్నారు. అమరావతిలో డ్రైనేజీ, రోడ్ల నిర్మాణ పనులు వేగంగా జరుగుతున్నాయని చెప్పారు. ఫిబ్రవరి నాటికి అవి పూర్తయ్యే అవకాశముందన్నారు. ఐకానిక్ టవర్ల నిర్మాణ పనులు జరుగుతున్నాయని అన్నారు. అమరావతి రాజధాని నిర్మాణం కోసం మరి కొంత భూమిని భూసేకరణ విధానంలో తీసుకునేందుకు సీఆర్డీఏ ఆమోదం తెలిపిందన్నారు. అయితే, భూ సేకరణకంటే భూ సమీకరణ వల్లే రైతులకు ఎక్కువ లాభం జరుగుతుందని చెప్పారు.