ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో అరెస్టయిన ధనుంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి, బాలాజీ గోవిందప్పలకు విజయవాడ ఏసీబీ కోర్టు బెయిల్ ఇచ్చిన సంగతి తెలిసిందే. అయితే, వారి బెయిల్ రద్దు చేయాలంటూ సిట్ అధికారులు హైకోర్టును ఆశ్రయించబోతున్నట్లు తెలుస్తోంది. వారి బెయిల్ రద్దు చేయాలని హౌస్ మోషన్ పిటిషన్ దాఖలు చేయబోతున్నారని తెలుస్తోంది. లిక్కర్ స్కామ్ కేసు నిందితులు బెయిల్ పై విడుదలై బయటే ఉంటే సాక్ష్యుల్ని ప్రభావితం చేసే అవకాశం ఉందని, కేసును తప్పుదోవ పట్టించే అవకాశాలు ఎక్కువగా ఉన్న విషయాన్ని కోర్టుకు వివరించనున్నట్లు తెలుస్తోంది.
అంతకుముందు, ఆ ముగ్గురి విడుదలలో జాప్యం నేపథ్యంలో విజయవాడ సబ్ జైలు దగ్గర హైడ్రామా నడిచింది. ఉద్దేశపూర్వకంగానే జైలు అధికారులు వారి విడుదలలో జాప్యం వహిస్తున్నారని వారి తరఫు న్యాయవాదులు ఆరోపించారు. విజయవాడ సబ్ జైలు సూపరిటెండెంట్ పై నిందితుల తరఫు న్యాయవాదులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ జైలు ఎదుట బైఠాయించి నిరసన తెలిపారు.
మరోవైపు, బెయిల్ ఇచ్చినా అధికారులు తమను విడుదల చేయకపోవడంతో జైలు లోపల గేటు దగ్గర నిందితులు ఆందోళనకు దిగారు. శనివారం సాయంత్రం బెయిల్ ఆర్డర్స్ వచ్చినా జైలు అధికారులు వారిని విడుదల చేయఃడంలో కావాలనే జాప్యం వహించారని. ఇది చట్టవిరుద్ధ నిర్బంధం కిందకు వస్తుందని, ఈ విషయాన్ని హైకోర్టు దృష్టికి తీసుకువెళతామని లాయర్లు తెలిపారు. ఎట్టకేలకు హైడ్రామా అనంతరం ఆదివారం ఉదయం ఆ ముగ్గురు జైలు నుంచి విడుదలయ్యారు.