ఏపీలో `హెలికాప్టర్` విషయం రచ్చ రేపింది. సీఎం చంద్రబాబు కోసం హెలికాప్టర్ కొనుగోలు చేశారని.. దీని కి సుమారు 30-40 కోట్ల రూపాయలు వెచ్చించారని సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం రాష్ట్రం అప్పుల కుప్పగా ఉన్న నేపథ్యంలో ఇంత ఖర్చు చేసి హెలికాప్టర్‌ను ఎందుకు కొనుగోలు చేయాల్సి వచ్చిందని.. ప్రతిపక్షం వైసీపీ నాయకులు సైతం విమర్శలు గుప్పిస్తున్నారు. ఇక, సోషల్ మీడియాలో అయితే.. మీమ్స్ జోరుగా సాగుతున్నాయి.
ఈ వ్యవహారంపై ప్రభుత్వం సీరియస్ అయింది. సోషల్ మీడియాలో వచ్చే మీమ్స్, ట్రోల్స్‌పై కేసులు నమోదు చేయాలని.. సంబంధిత వ్యక్తులను చట్ట పరంగా శిక్షించాలని ముఖ్యమంత్రి కార్యాలయ వర్గాలు ఆదేశించాయి. మరోవైపు.. ప్రభుత్వం ఈ హెలికాప్టర్ వ్యవహారంపై వివరణ ఇచ్చింది. సీఎం చంద్రబాబు కు ఇప్పటి వరకు ఉన్న `భెల్`(భారత హెవీ ఎలక్ట్రికల్ లిమిటెడ్)కు చెందిన హెలికాప్టర్‌ను వినియోగిస్తు న్నారు. అయితే.. ఇది తరచుగా రిపేర్లకు వస్తోంది. ఈ క్రమంలోనే కొత్తది కొనుగోలు చేయాలని భావించా రు.
దీనికి సంబంధించి ముగ్గురు మంత్రులతో కూడిన కమిటీని కూడా ఏర్పాటు చేశారు. తర్వాత.. ఖరీదు ఎక్కువకావడం.. హెలికాప్టర్‌తో నిరంతరం ప్రయాణించాల్సిన అవసరం కూడా లేకపోవడంతో ఈ ప్రతిపా దనను పక్కన పెట్టారు. దీనిస్థానంలో అధునాతన సౌకర్యాలు ఉన్న మరో హెలికాప్టర్ `ఎయిర్ బస్ హెచ్- 160`ను అద్దెకు తీసుకున్నారు. దీనినే ప్రస్తుతం సీఎం చంద్రబాబు వినియోగిస్తున్నారు. అయితే.. 30-40 కోట్ల రూపాయలు ఖర్చు చేసి కొనుగోలు చేశారని.. ఇది ఆర్థిక భారం పెంచిందని పేర్కొంటూ.. సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతుండడంతో సర్కారు సీరియస్ అయింది. వ్యతిరేక ప్రచారం చేసేవారిపై చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించింది.