వైసీపీ అధినేత వైఎస్ జగన్ కు ఏపీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు(ఆర్ఆర్ఆర్) వార్నింగ్ ఇచ్చారు. ఈసారి అసెంబ్లీకి రాకుంటే ప్రతిపక్ష హోదా కాదు కదా అసలు సభ్యత్వమే ఉండదని గుర్తుచేశారు. ప్రతిపక్ష హోదా ఇవ్వాలని పట్టుబట్టి అసెంబ్లీ సమావేశాలను జగన్ గాలికి వదిలేయడం ఇప్పటికే రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ఈ నెల జరగబోయే వర్షాకాల సమావేశాలకు కూడా జగన్ హాజరు కాని పరిస్థితి కనిపిస్తోంది. ఆయన గైర్హాజరుపై పార్టీ నేతల్లోనూ అసహనం పెరుగుతోంది.
మరోవైపు అధికార పార్టీ నాయకులు జగన్ వైఖరిపై ఘాటుగా విరుచుకుపడుతున్నారు. అసెంబ్లీకి రావడానికి భయపడుతున్నారా? లేక ఓటమి భారం మింగలేకపోతున్నారా? అని ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. ప్రజా సమస్యలపై నిలదీయగల సత్తా ఉంటే అసెంబ్లీకి వచ్చి చూపించాలని సవాలు విసురుతున్నారు. అయినప్పటికీ జగన్ వైఖరిలో ఎటువంటి మార్పు రావడం లేదు. తాజాగా డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు జగన్‌తో సహా వైసీపీ శాసనసభ్యులను హెచ్చరించారు.
అసెంబ్లీ నిబంధనల ప్రకారం ఒక పార్టీకి ప్రతిపక్ష హోదా రావాలంటే కనీసం 10శాతం సీట్లు గెలుచుకోవాలి. అంటే, కనీసం 18 స్థానాలు ఉండాలి. కానీ వైసీపీ ఆ అర్హత సాధించలేదు. అవసరమైన సంఖ్యా బలం లేకపోయినా, ప్రతిపక్ష హోదా కోసం జగన్ ఒక చంటి పిల్లాడిలా మారాం చేస్తూ టైమ్ వేస్ట్ చేస్తున్నారని ఆర్ఆర్ఆర్ ఎద్దేవా చేశారు. చట్టసభలకు వరుసగా 60 రోజుల పాటు సభ్యులు గైర్హాజరైతే, వారి సభ్యత్వం వాటంతట అదే రద్దవుతుందనే నిబంధనను ఈ సందర్భంగా రఘురామకృష్ణరాజు గుర్తు చేశారు. `వైసీపీ ఎమ్మెల్యేలు సభకు రాకుండా, ఉప ఎన్నికలనే కోరుకుంటున్నట్లు కనిపిస్తోంది. అదే వారి ఉద్దేశమైతే మేము చేయగలిగిందేమీ లేదు. పులివెందులకు ఉప ఎన్నిక ఖాయం` అంటూ రఘురామకృష్ణరాజు వ్యాఖ్యానించారు.