ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో ఏ4 నిందితుడిగా ఉన్న వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డికి విజయవాడ ఏసీబీ కోర్టు ఊరటనిచ్చింది. ఉప రాష్ట్రపతి ఎన్నికలో ఓటు వేసేందుకు మిథున్ రెడ్డికి మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. అయితే, ఈ నెల 11న తిరిగి రాజమండ్రి జైల్లో మిథున్ రెడ్డి సరెండర్ కావాలని ఆదేశించింది. 50 వేల రూపాయల పూచీకత్తుతో రెండు షూరిటీలు సమర్పించాలని కోర్టు ఆదేశించింది.. ఈ నెల 11వ తేదీన సాయంత్రం 5 గంటలలోపు సరెండర్ కావాలని షరతులు విధించింది.
జూలై 20వ తేదీ నుంచి రాజమండ్రి సెంట్రల్ జైల్లో మిథున్ రెడ్డి రిమాండ్ ఖైదీగా ఉన్న సంగతి తెలిసిందే. ఓ వైపు మధ్యంతర బెయిల్ కోసం ప్రయత్నిస్తూ, మరోవైపు రెగ్యులర్ బెయిల్ కోసం కూడా మిథున్ రెడ్డి ప్రయత్నాలు కొనసాగిస్తున్నారు. మిథున్ రెడ్డికి రెగ్యులర్ బెయిల్ ఇంకా లభించలేదు. కాగా, ఢిల్లీ లిక్కర్ స్కామ్ ను మించి ఏపీ లిక్కర్ స్కామ్ జరిగిందని ఆరోపణలు వస్తున్న సంగతి తెలిసిందే. అయితే, ఈ కుంభకోణంతో మిథున్ రెడ్డికి సంబంధం లేదని మాజీ మంత్రి పెద్దిరెడ్డి అంటున్నారు.