నందమూరి బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబినేషన్ అంటేనే మాస్ ఆడియన్స్‌కి ఫుల్ జోష్. ఈ కాంబో నుంచి వచ్చిన హ్యాట్రిక్ ఫిల్మ్ అఖండ బాక్సాఫీస్ వద్ద దుమ్మురేపిన విషయం తెలిసిందే. అదే విజయాన్ని కొనసాగిస్తూ ఇప్పుడు సీక్వెల్‌గా `అఖండ 2` తెరకెక్కుతోంది. ఇందులో సంయుక్త మీనన్ హీరోయిన్ కాగా.. ఆది పినిశెట్టి విలన్ పాత్రలో అలరించబోతున్నారు. షూటింగ్ ఆల్మోస్ట్ కంప్లీట్ అయింది. పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ స్పీడ్‌గా జరుగుతున్నాయి.
మొదట ఈ సినిమా సెప్టెంబర్ 25న రిలీజ్ అవుతుందని అఫీషియల్‌గా చిత్రబృందం ప్రకటించినప్పటికీ, ఆ తర్వాత రిలీజ్ వాయిదా పడింది. దీంతో అభిమానుల్లో ఉత్కంఠ పెరిగిపోయింది. ఇందుకు తోడు బాలయ్య మాస్ ఇమేజ్‌కి తగిన యాక్షన్ సన్నివేశాలు, బోయపాటి స్టైల్ ఎమోషనల్ ప్యాకేజింగ్‌తో అఖండ 2 మరోసారి రికార్డు స్థాయిలో ఆడియన్స్‌ని ఆకట్టుకునేలా ఉండబోతుందని టాక్ నడుస్తుండటంతో ఫ్యాన్స్ మరింత ఎగ్జైట్ అయిపోతున్నారు.
అయితే తాజాగా అఖండ 2 రిలీజ్ డేట్ ను బాలయ్య తన నోటితోనే లీక్ చేశారు. ఓ పబ్లిక్ ఈవెంట్‌లో పాల్గొన్న ఆయన అఖండ 2 సినిమా గురించి మాట్లాడారు. డిసెంబర్ మొదటి వారంలో సినిమా థియేటర్లలోకి రానుందని బాలయ్య వెల్లడించారు. ఖచ్చితమైన తేదీని మాత్రం రివీల్ చేయలేదు. కానీ, డిసెంబర్ 5 శుక్రవారం కావడంతో అదే రోజు రిలీజ్ అయ్యే అవకాశముందని ఫ్యాన్స్ భావిస్తున్నారు. లేదా అఖండ చిత్రం డిసెంబర్ 2న విడుదలై భారీ విజయాన్ని నమోదు చేసింది. సో.. హిట్ సెంటిమెంట్ రిపీట్ చేసేందుకు అఖండ 2ను అదే తేదీకి తీసుకొచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి.