సైన్స్ అండ్ టెక్నాలజీ అకాడమీ ఛైర్మన్ గా రవి మందలపును నియమించిన సంగతి తెలిసిందే. రాజమండ్రి సిటీ టీడీపీ నేతగా సేవలందిస్తున్న రవి మందలపునకు సీఎం చంద్రబాబు తగిన గుర్తింపునిచ్చారు. ఉభయ గోదావరి జిల్లాల జోనల్ కో ఆర్డినేటర్ గా కొనసాగుతున్న ఆయనకు చంద్రబాబు కీలక పదవినిచ్చారు. TANA లో పలు హోదాలలో సేవలందించిన రవికి ఎన్నారైల నుంచి మంచి మద్దతు ఉంది. ఈ క్రమంలోనే సైన్స్ అండ్ టెక్నాలజీ అకాడమీ ఛైర్మన్ గా రవి మందలపు పదవీ బాధ్యతలు స్వీకరించిన సందర్భంగా అమెరికాలో ఆత్మీయ సమావేశం జరగనుంది.
అమెరికాలోని రవి మందలపు ఫ్రెండ్స్ సర్కిల్ ఈ కార్యక్రమం నిర్వహించనుంది. న్యూజెర్సీలోని ఎడిసన్ లో ఉన్న రాయల్ ఆల్బర్ట్స్ ప్యాలెస్ నందు సెప్టెంబర్ 14వ తేదీ ఆదివారం ఉదయం 11 గంటలకు ఈ కార్యక్రమం జరగుంది. ఈ కార్యక్రమానికి ఎన్నారైలు హాజరుకావాలని రవి మందలపు ఫ్రెండ్స్ సర్కిల్ ఆహ్వానిస్తోంది.
సీఎం చంద్రబాబు నుంచి స్ఫూర్తి పొందిన రవి మందలపు ముందుగా TANAలో సేవలందించారు. 2004 నుంచి తానా సభ్యుడిగా ఉన్న రవి మందలపు 2017లో తానా ఫౌండేషన్ కు ఎన్నికయ్యారు. 2019-20 కాలంలో తానా ఫౌండేషన్ కార్యదర్శిగా పనిచేశారు. 2021-23 వరకు తానా ఇన్వెస్ట్ మెంట్ కమిటీ సభ్యుడిగా సేవలందించారు. అంతేకాకుండా తన స్వగ్రామం పసుమర్రులో పలు సేవాకార్యక్రమాలు నిర్వహించారు. విజయవాడ లేదా ఖమ్మంలో 200-250 మంది నివసించేలా వృద్ధాశ్రమం నిర్మించాలన్న ఆకాంక్షతో ఆయన ఉన్నారు.