జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా మంగళగిరిలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఏపీ సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేష్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా నేతన్నలకు సీఎం చంద్రబాబు తీపి కబురు చెప్పారు. అమరావతిలో హ్యాండ్లూమ్ మ్యూజియం ఏర్పాటు చేస్తామని చంద్రబాబు ప్రకటించారు. భారతీయ శక్తి, సంస్కృతీసంప్రదాయాలకు చేనేత ప్రతీక అని చంద్రబాబు అన్నారు. 11వ జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా నేతన్నల కోసం తమ ప్రభుత్వం అమలు చేయబోతోన్న సరికొత్త సంక్షేమ పథకాల గురించి చంద్రబాబు వివరించారు.
https://x.com/i/status/1953480399952421105
నైపుణ్యం, సృజనాత్మకత కలగలిస్తే చేనేతలని..టిడిపికి నేతన్నలకు అవినాభావ సంబంధం ఉందని చంద్రబాబు స్పష్టం చేశారు. వ్యవసాయం తర్వాత అత్యధికంగా ఉపాధి కల్పించేది వస్త్ర పరిశ్రమ అని అన్నారు. ఈ నెల నుంచి 200 యూనిట్ల విద్యుత్ ను చేనేత కార్మికులకు ఉచితంగా ఇస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు. మరమగ్గాలకు 500 యూనిట్ల విద్యుత్ ఉచితంగా ఇస్తామని ప్రకటించారు. చేనేతలకు ఎన్ని రాయితీలు ఇచ్చినా తక్కువే అని, ఉచిత విద్యుత్ వల్ల 93,000 కుటుంబాలకు లబ్ధి చేకూరుతుందని చంద్రబాబు అన్నారు.
5500 మంది చేనేత కార్మికులకు 2 లక్షల చొప్పున 27 కోట్ల రూపాయల రుణాలు మంజూరు చేశామని గుర్తు చేశారు. 90 వేల కుటుంబాలకు 100 యూనిట్లు కరెంటును ఉచితంగా ఇస్తున్నామన్నారు. రాష్ట్రంలోనే తొలిసారిగా చేనేత కార్మికులకు 50 ఏళ్లకే పెన్షన్ ఇవ్వాలని తమ ప్రభుత్వం నిర్ణయించిందని చెప్పారు. 50% సబ్సిడీతో మరమగ్గాల కోసం 90 కోట్లు ఖర్చు చేసిందని గుర్తు చేశారు.
ఇక, భారతీయ సాంస్కృతిక వారసత్వానికి ప్రతీక చేనేత అని మంత్రి లోకేష్ చెప్పారు. చేనేత సోదరులు నేసిన వస్త్రాలకు ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు ఉందన్నారు. నేటి నుంచి ప్రతి చేనేత కార్మికుడి కుటుంబానికి నెలకు 200 యూనిట్ల ఉచిత విద్యుత్, మరమగ్గాలకు 500 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అందించబోతున్నామని ప్రకటించారు. చేనేత వస్త్రాలపై జీఎస్టీ భారాన్ని ప్రభుత్వం భరించనుందని, నేత కార్మికులకు తమ ప్రభుత్వం ఎప్పుడు వెన్నంటి ఉంటుందని చెప్పారు.