వైసీపీలో కీలక నేతగా మారి.. అనేక కార్యకలాపాలను నిర్వహించి.. ఆ పార్టీ అధినేత జగన్‌కు రైట్ హ్యాండ్‌గా మారిన వేణుంబా కం విజయసాయిరెడ్డి తెలుసుకదా!. గతేడాది.. ఆయన జగన్‌తో ఉన్న సుదీర్ఘ అనుబంధాన్ని `తెంచుకుని` బయటకు వచ్చా రు. పార్టీ పరంగా దఖలు పడిన రాజ్యసభ సభ్యత్వాన్ని కూడా రద్దు చేసుకుని మరీ జగన్‌కు బై చెప్పారు. అయితే.. ఆ సమయం లో ఆయన `అంతా స్వీయ నిర్ణయం` అని కూడా ప్రకటించారు. పార్టీలో ఉన్న కొందరు నేతలతో సరిపడకే..(జగన్ కాదు) తాను బయటకు వచ్చానని కూడా చెప్పుకొచ్చారు. అయితే.. తొలినాళ్లలో ఈ వ్యవహారాన్ని కొందరు అనుమానించినా.. 4 ఏళ్లకు పైగా ఉన్న రాజ్యసభ సభ్యత్వాన్ని సైతం వదులుకుని రావడంతో `నమ్మేశారు.`
కట్ చేస్తే.. ఇప్పుడు కొన్ని కారణాలు వెలుగులోకి వచ్చిన తర్వాత.. సాయిరెడ్డి వైసీపీని వదిలిపెట్టడానికి ఈ కారణాలకు మధ్య ఏదో కార్యాకారణ సంబంధం ఉందన్న అనుమానాలు రాజకీయ వర్గాల్లో మెదులుతున్నాయి. ఇదే ఇప్పడు అకస్మాత్తుగా చర్చ కు.. అనేక సందేహాలకు కూడా దారి తీసింది. ప్రధానంగా.. సాయిరెడ్డి వైసీపీని విడిచిన పెట్టిన సమయం.. ప్రస్తుతం జరుగుతు న్న పరిణామాలకు లింకు పెట్టి పలువురు విశ్లేషకులు కూడా అనేక సందేహాలను తెరమీదికి తెస్తున్నారు. ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత.. వైసీపీ హయాంలో జరిగిన మద్యం కుంభకోణం కేసు విచారణకు ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని నియమించింది. దీనికి సంబంధించి.. ఓ వారం ముందునుంచే పెద్ద ఎత్తున మీడియాలో ప్రచారం జరిగింది.
ఈ ప్రచారం జరుగుతున్న సమయంలో.. సాయిరెడ్డి.. రెండు సార్లు తాడేపల్లికి వచ్చారని టీడీపీ కీలకనాయకుడు ఒకరు తాజాగా వెల్లడించారు. అనంతరం.. సిట్ ఏర్పాటైన తర్వాత... వారంలోనే ఆయన వైసీపీకి రాజీనామా చేయడం.. రాజ్యసభ సీటును వదులుకోవడం వరుసగా జరిగిపోయాయని చెప్పుకొచ్చారు. అంటే.. ఇది యాదృచ్ఛికం కాదని.. పక్కా వ్యూహం ఉందని ఆయన అనుమానం వ్యక్తం చేశారు. తాజాగా మద్యం కుంభకోణం సూత్రధారి సాయిరెడ్డే నన్న సంకేతాలు వస్తున్నాయని.. ఈ నేపథ్యంలో సాయిరెడ్డిని మరోసారి విచారించేందుకు కూడా సిట్ రెడీ అయిందని తెలిపారు. కానీ.. తాను వైసీపీలో ఉంటే.. అందునా.. జగన్‌కు సన్నిహితుడిగా ముద్ర పడిన నేపథ్యంలో కేసు తీవ్రత పెరిగే అవకాశం ఉంటుందని సాయిరెడ్డిని జగనే పక్కన పెట్టారని సదరు నాయకుడు చెబుతున్నారు.
దీనివల్ల అధికార పార్టీ కేవలం వైసీపిని మాత్రమే టార్గెట్ చేస్తుందని.. అప్పుడు కీలక విషయాలు తెలిసిన సాయిరెడ్డిపై ఎవరికీ అనుమానం కూడా రాబోదన్నది సదరు నాయకుడు వెలిబుచ్చిన అనుమానం. అయితే.. ఇది నిజమేనా? అనేది తేలాల్సి ఉంది. ఒక్కొక్కసారి దేశంలో ఇలాంటివి కూడా జరుగుతున్నాయి. కేసుల నుంచి తప్పించుకునేందుకు మధ్య ప్రదేశ్‌లో ఉన్నత స్థాయి ఉద్యోగులైన భార్యా, భర్త విడాకులు తీసుకున్నారు. దాదాపు ఐదేళ్ల తర్వాత.. వారి అక్రమాలు వెలుగు చూసి.. అరెస్టయ్యారు. ఇలానే.. ఇప్పుడు వైసీపీ హయాంలో సూత్రధారిగా వ్యవహరించిన సాయిరెడ్డిని జగన్ వ్యూహాత్మకంగా తప్పించే ఉంటారన్నది విశ్లేషకులు కూడా అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. మరి లోగుట్టు తెలియాలంటే.. కొన్నాళ్లు వెయిట్ చేయక తప్పదు.