పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ కెరీర్‌లోనే తొలిసారి హారర్ జోనర్ ని టచ్ చేస్తూ నటిస్తున్న రొమాంటిక్ ఎంటర్టైనర్ `ది రాజా సాబ్`. మారుతి డైరెక్టర్ కాగా.. మాళవిక మోహనన్, నిధి అగర్వాల్, రిద్ది కుమార్ హీరోయిన్లుగా యాక్ట్ చేస్తున్నారు. ప్రస్తుతం చిత్రీకరణలో దశలో ఉన్న ఈ చిత్రంపై ఇప్పటికే భారీ హైప్ ఏర్పడింది. ఎప్పుడెప్పుడు సినిమా థియేటర్స్‌లోకి వస్తుందా అని అటు ఫ్యాన్స్, ఇటు సినీ లవర్స్ ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు.
అయితే తాజాగా రాజా సాబ్ కు సంబంధించి ఫ్యాన్స్ ఫుల్ ఖుషి అయ్యే ఒక గుడ్ న్యూస్ మరియు నిరాశ పరిచే ఒక బ్యాడ్ న్యూస్ బయటకు వచ్చాయి. గుడ్ న్యూస్ ఏంటంటే రాజా సాబ్ సినిమాకు పార్ట్ 2 కూడా ఉండబోతుంది. స్టోరీ ఆధారంగా మరియు క్లైమాక్స్ లో వచ్చే ట్విస్ట్ బట్టి సినిమాకు సీక్వెల్ ఉంటే బాగుంటుందని దర్శక నిర్మాతలు భావిస్తున్నారట. అందులో భాగంగానే పార్ట్ 2 స్క్రిప్ట్ ను రెడీ చేస్తున్నారట. తాజాగా రాజా సాబ్ 2 ఉంటుందని నిర్మాత టీజీ విశ్వప్రసాద్ స్పష్టం చేశారు.
ఇక బ్యాడ్ న్యూస్ విషయానికి వస్తే.. ఈ సినిమా రిలీజ్ డేట్ పోస్ట్ పోన్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. మొదట ఈ చిత్రాన్ని డిసెంబర్ 5న విడుదల చేయాలని అనుకున్నారు. కానీ మేకర్స్ ఇప్పుడు సంక్రాంతి పై కనేసినట్టు బలంగా టాక్ నడుస్తోంది. తాజాగా టీజీ విశ్వప్రసాద్ మాట్లాడుతూ.. `రాజా సాబ్ అక్టోబర్ నాటికి సిద్ధమవుతుంది. తెలుగు బయ్యర్స్ జనవరి 9న రిలీజ్ చేయమని, హిందీ బయ్యర్స్ డిసెంబర్ 5న రిలీజ్ చేయమని అడుగుతున్నారు. ఫాన్స్ కూడా సంక్రాంతి బరిలోనే సినిమాను చూడాలనుకుంటున్నారు. ప్రస్తుతానికి మేము ఇంకా ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు.
టాకీ పార్ట్ పూర్తి అయింది. సాంగ్స్ బ్యాలెన్స్ ఉన్నాయి. వీఎఫ్ఎక్స్ విషయంలో ఎక్కడ రాజీ పడకుండా చేస్తున్నాం` అని పేర్కొన్నారు. మొత్తంగా ఈయన వ్యాఖ్యలు బట్టి చూస్తే వచ్చే ఏడాది జనవరికి రాజాసాబ్ పోస్ట్ పోన్ అయ్యే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. అదే జరిగితే ప్రభాస్ ప్లేస్ ను రీప్లేస్ చేస్తూ `అఖండ 2`తో బాలయ్య బరిలోకి దిగడం కూడా కన్ఫార్మ్ అవుతుంది.