ప్రధాని నరేంద్ర మోడీ .. తెలంగాణకు బద్ధ శత్రువని సీఎం రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద నిర్వహించిన నిరసనలో ఆయన మాట్లాడుతూ.. తెలంగాణలోని బీసీలకు 42 శాతం రిజర్వేషన్ కల్పిస్తే.. గుజరాత్ పాలకులు జీర్ణించుకోలేక కడుపు మంటతో రగిలిపోతున్నారని వ్యాఖ్యానించారు. బీసీ బిల్లుకు ఆమోదం తెలపకపోతే.. గద్దె దింపుతామని ప్రధాని మోడీని ఆయన హెచ్చరించారు. తెలంగాణ అసెంబ్లీ ఆమోదించిన బీసీలకు 42 శాతం రిజర్వేషన్ కల్పించే బిల్లుకు రాష్ట్రపతి ఆమోదం తెలపలేదు. ఈ నేపథ్యంలో కేంద్రంపై ఒత్తిడి పెంచే ఉద్దేశంతో తెలంగాణ ప్రభుత్వం ఢిల్లీలో ధర్నాకు దిగింది.
ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి 40 నిమిషాల పాటు ప్రసంగించారు. తెలంగాణలోని 4 కోట్ల మందికి పైగా ప్రజలు బీసీ రిజర్వేషన్ కోసం ఎదురు చూస్తున్నారని సీఎం చెప్పారు. ``జంతర్ మంతర్ వేదికగా మోడీ, ఎన్డీయే ప్రభుత్వానికి సవాల్ విసురుతున్నా.`` అని రేవంత్ అన్నారు. తెలంగాణ ప్రజల సుదీర్ఘకాల డిమాండ్ అయిన.. బీసీ రిజర్వేషన్ బిల్లు డిమాండ్‌ను ఆమోదిస్తారా? లేదా? అని ప్రశ్నించారు. ఆమోదించని పక్షంలో మిమ్మల్ని గద్దె దించాలా? అని నిలదీశారు. ``మా ఆలోచనలు, బిల్లులను తుంగలో తొక్కే అధికారం మీకు ఎవరిచ్చారు? మోడీ తెలంగాణకు బద్ధశత్రువు.`` అని రేవంత్ నిప్పులు చెరిగారు.
తెలంగాణలోనే ఈ విషయం తేల్చుకోవాలని అనుకున్నా.. తమను ఢిల్లీ వరకు తీసుకువచ్చారని సీఎం వ్యాఖ్యానించారు. అందుకే చలో ఢిల్లీ పేరుతో నిరసనకు పిలుపునిచ్చామన్నారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు ఎలాగైనా సాధిస్తామని తేల్చి చెప్పారు. తెలంగాణ ప్రజల ఓట్లు బీజేపీకి కావాలని.. కానీ.. వారి క్షేమం, వారి మేలు మాత్రం ఆ పార్టీకి అవసరం లేకుండా పోయాయని విమర్శించారు. ప్రధాని మోడీ చెప్పినట్టు వినే.. కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్‌లు తెలంగాణ బీసీలకు ద్రోహం చేస్తున్నారని దుయ్యబట్టారు. ``తెలంగాణలోని బీసీల ఓట్లు మీకు అవసరం లేదా? ఇప్పటి వరకు వారి ఇళ్లకు వెళ్లి బ్రతిమాలి మరీ ఓట్లు వేయించుకోలేదా? `` అని నిలదీశారు.
తెలంగాణ బీసీ బిడ్డలు ఏం పాపం చేసుకున్నారని సీఎం రేవంత్ రెడ్డి నిప్పులు చెరిగారు. వారికి రాష్ట్రంలో 42 శాతం రిజర్వేషన్ ఫలాలను అందించాలన్న కృత నిశ్చయంతో ఉన్నామని.. కానీ, ఈ విషయాన్ని బీజేపీ పాలకులు పెడచెవిన పెడుతున్నారని దుయ్యబట్టారు. ``ప్రజలతో మీ అవసరం తీరిపోయిందా?`` అని కేంద్ర మంత్రులను ఉద్దేశించి ప్రశ్నలు గుప్పించారు. ఈ సందర్భంగా తెలంగాణ ప్రధాన ప్రతిపక్షం బీఆర్ ఎస్ పైనా రేవంత్ విమర్శలు గుప్పించారు. పార్టీ పేరులో టీఆర్ ఎస్‌ను తీసేసి.. బీఆర్ ఎస్‌గా మార్చుకున్నారని.. ఇప్పుడు బీసీలతోనూ బంధం తెంచుకుంటున్నారా? అని ప్రశ్నించారు. కనీసం.. మీకు బాధ్యత లేదా? అని మాజీ సీఎం కేసీఆర్‌ను ఉద్దేశించి వ్యాఖ్యానించారు.