అభిమానుల ప్రేమను సమాజ సేవకు ఉపయోగించాలి అనే గొప్ప ఆలోచన చేసిన వ్యక్తి మెగాస్టార్ చిరంజీవి. ఆయన ఆలోచన నుంచి పుట్టిందే చిరంజీవి బ్లడ్ బ్యాంక్. చిరు పిలుపు మేరకు ప్రతి ఏడాది లక్షలాదిమంది మెగా అభిమానులు రక్తదానం చేస్తుంటారు. తద్వారా ఎంతోమంది ప్రాణాలను నిలబెడుతూ వారి గుండె చప్పుడైన మెగాస్టార్.. తాజాగా ఫీనిక్స్ ఫౌండేషన్‌తో కలిసి ఏర్పాటు చేసిన బ్లడ్ డొనేషన్ క్యాంప్‌కి స్పెషల్ గెస్ట్ గా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రక్తదానం అనగానే తాను గుర్తొస్తున్నానంటే అది తన ఎన్నెన్నో జన్మల పుణ్యఫలమన్నారు.
`ఈ కార్యక్రమానికి వచ్చి బ్లడ్ డోనేట్ చేసిన వారందరికీ శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను. నా బిడ్డ లాంటి తేజ కూడా ఇక్కడ వచ్చిన బ్లడ్ డోనేట్ చేసినందుకు ప్రత్యేక ధన్యవాదాలు. రక్తదానం గొప్పతనాన్ని వివరిస్తూ ఓ జర్నలిస్ట్ రాసిన ఆర్టికల్ చదివాకే బ్లడ్ బ్యాంక్ పెట్టాలని డిసైడ్ అయ్యాను. అభిమానులను కీర్తి కోసం వాడుకొనేకన్నా రక్తదానం వైపు నడిపించగలిగితే సమాజంలో వాళ్లకు గౌరవం పెరగడంతో పాటు ఎనలేని సంతృప్తి కలుగుతుంది కదా అనే ఆలోచనతో ఆరోజు రక్తదానికి పిలుపునిచ్చాను` అని చిరంజీవి వివరించారు.
అలాగే ఇదే కార్యక్రమంలో సోషల్ మీడియాలో వచ్చే విమర్శలపై చిరంజీవి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. ఆయన మాట్లాడుతూ.. `గత కొన్నేళ్ల నుంచి నేను రాజకీయాలకు పూర్తిగా దూరంగా ఉన్నాను. అయిన కూడా కొందరు నేతలు విమర్శిస్తూనే ఉంటారు. గతంలో ఓ పోలిటీషియన్ అకారణంగా నన్ను విమర్శించడం మొదలుపెట్టాడు. ఆయన ఆయన ఒక ముంపు ప్రాంతానికి వెళ్లగా.. అక్కడ ఒక మహిళ తనని సదరు పోలిటిషియన్‌కు చివాట్లు పెట్టింది.
చిరంజీవిని అలాంటి మాటాలు అనడానికి నోరెలా వచ్చిందంటూ కడిగిపారేసింది. ఇందుకు సంబంధించిన వీడియో నా దగ్గరకు రాగా.. ఆమె తన అభిమానేమో అని ఆరా తీశాను. కానీ నిజానికి ఆమె నా అభిమాని కాదు. కొంత కాలం క్రితం రక్తం దొరక్క ప్రాణాలతో పోరాడుతున్న ఆమె బిడ్డ చిరంజీవి బ్లడ్‌బ్యాంక్ ద్వారానే బతికాడని.. అందుకే నేనంటే ఆమెకు గౌరవమని తెలిసింది. ఆ క్షణం నా మనసు ఉప్పొంగిపోయింది. అందుకే రాజకీయ విమర్శలపై నేను స్పందించను. నేను చేసిన సేవా కార్యక్రమాలు, అభిమానుల ప్రేమాభిమానాలే నాకు రక్షణ కవచం. నాపై చెడు రాతలు, మాటలకు నేను చేసే మంచే సమాధానమని` చిరంజీవి నొక్కి చెప్పారు.