వైసీపీ అధినేత జగన్ సొంత బాబాయి వైఎస్ వివేకానందరెడ్డి దారుణ హత్యకు సంబంధించిన విచారణ ను దాదాపు పూర్తి చేశామని.. ప్రధాన నిందితులుగా భావిస్తున్నవారి నుంచి వాంగ్మూలాలు నమోదు చేశా మని.. ఈ కేసును విచారిస్తున్న సీబీఐ అధికారులు సుప్రీంకోర్టుకు తెలిపారు. అయితే.. సుప్రీంకోర్టు ఒకవేళ తిరిగి మరోసారి విచారించాలని ఆదేశిస్తే.. ఆమేరకు విచారణ చేపడతామని కూడా చెప్పారు. దీనిపై సుప్రీం కోర్టు నిర్ణయం తీసుకోవాల్సి ఉంది.
ఏం జరిగింది?
వివేకా హత్య కేసులో ప్రస్తుత కడప ఎంపీ అవినాష్ రెడ్డి నిందితుడుగా ఉన్నారని.. సీబీఐ ఆరోపిస్తున్న విషయం తెలిసిందే. గతంలో ఆయనను విచారించారు. ఒకదఫా అరెస్టు చేశారు. అయితే.. అరెస్టు అయిన నిమిషాల వ్యవధిలోనే ఆయనకు ముందస్తు బెయిల్ రావడంతో వదిలేశారు. కానీ.. ఈ ముందస్తు బెయిల్ చట్ట విరుద్ధమని, ఆయన ప్రధాన నిందితుడని పేర్కొంటూ.. వివేకా కుమార్తె నర్రెడ్డి సునీత సహా సీబీఐ అధికారులు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఆయన బెయిల్‌ను రద్దు చేయాలని కోరారు.
ఈ క్రమంలోనే ఎంపీ అవినాష్ రెడ్డి సాక్షులను ప్రభావితం చేస్తున్నారని కూడా కోర్టుకు తెలిపారు. ఈ సందర్భంగా కోర్టు పలుమార్లు విచారణ చేసి..అసలు ఈ కేసు విచారణ ఎప్పటి వరకు వచ్చిందని ప్రశ్నించింది. దీంతో సీబీఐ తాజాగా కేసు విచారణ పూర్తయిందని పేర్కొంది. ఇదేసమయంలో సునీత సహా అప్పటి సీబీఐ డీఎస్పీ రామ్ సింగ్ పై కొందరు పెట్టిన కేసు విచారణను కూడా సుప్రీంకోర్టు ప్రశ్నించింది.
అయితే.. సదరు కేసును ప్రభుత్వం వెనక్కి తీసుకుందని సీబీఐ అధికారులు వివరించారు. ఈ కేసులో వాలిడిటీ లేదని.. ఉద్దేశ పూర్వకంగానే సునీత, రామ్ సింగ్‌లపై కేసు పెట్టారని.. కోర్టుకు వివరించారు. దీనిని పరిశీలించిన కోర్టు.. అవినాష్ రెడ్డి బెయిల్ రద్దుపై తీర్పును వెల్లడించనున్నట్టు పేర్కొంది. మరి ఏం జరుగుతుందనేది చూడాలి.