ఏపీ కాంగ్రెస్ పార్టీ చీఫ్ గా ఉన్న వైఎస్ షర్మిలపై ఆ పార్టీ సీనియర్లు సహా.. ఇటీవల కాలంలో వైసీపీ నుంచి వచ్చి కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్న నాయకులు కూడా అసహనంతో ఉన్నారు. షర్మిల వైఖరితో పార్టీకి తీరని నష్టం వాటిల్లుతోందని నాయకులు అభిప్రాయపడుతున్నారు. ఈ విషయంలో పార్టీ అధిష్టానం పునరాలోచన చేసుకోవాలని కూడా చెబుతున్నారు. ఈ క్రమంలో తాజాగా కేంద్ర మాజీ మంత్రి, శ్రీకాకుళం నాయకురాలు కిల్లి కృపారాణి.. సంచలన వ్యాఖ్యలు చేశారు.
షర్మిల వ్యవహార శైలిలో కూటమి ప్రభుత్వానికి మంచి పేరు వస్తోందన్నారు. కాంగ్రెస్ పార్టీ ప్రయోజనాల కంటే కూడా.. పొరుగు పార్టీలకు మేలు చేయాలన్న తలంపు చాలా మంది నాయకుల్లో ఉందని కృపారాణి వ్యాఖ్యానించారు. వీరి గురించి.. తాను కేంద్ర అధిష్టానానికి ఫిర్యాదులు చేశానని కొందరు చెబుతున్నారని. కానీ, వాటిలో వాస్తవం లేదన్నారు. పార్టీ అధిష్టానం పీసీపీ చీఫ్‌ను మార్చాలని కొన్నాళ్లుగా ప్రయత్నాలు చేస్తున్న మాట వాస్తవమేనని చెప్పారు. అయితే.. షర్మిలను కొనసాగించినా.. తనకు అభ్యంతరం లేదన్నారు.
కానీ.. పార్టీ చీఫ్‌గా ఉన్నవారు.. అందరినీ కలుపుకొని పోవాల్సిన అవసరం ఉందని.. కానీ.. షర్మిల ఈ విషయంలో ఉదాశీనంగా వ్యవహరిస్తూ.. మిగిలిన నాయకులు .. అసలు నాయకులే కాదన్నట్టుగా.. తను మాత్రమే నాయకురాలిని అన్నట్టుగా వ్యవహరిస్తుండడం తమకు ఇబ్బందిగా ఉందనేది అందరికీ తెలిసిందేనని వ్యాఖ్యానించారు. ప్రతి విషయాన్నీ ఓ పార్టీ నాయకుడికి(జగన్) ముడిపెట్టి మాట్లాడడం వల్ల కాంగ్రెస్ పార్టీ పుంజుకుంటుందని.. సీనియర్లు సంతోషిస్తారని ఆమె భావిస్తే.. తాను ఏమీ చెప్పలేనన్నారు. ఈ విషయంలో తాను ఎవరితోనూ విభేదించడం లేదన్నారు.
ఇదిలావుంటే.. గతంలోనూ సుంకర పద్మశ్రీ సహా ప్రస్తుతం వైసీపీలో ఉన్న సాకే శైలజానాథ్ వంటి వారు కూడా షర్మిల వ్యవహార శైలిని తప్పుబట్టారు. ఆమె నాణేనికి ఒకవైపు చూస్తున్నారని సాకే వ్యాఖ్యానించగా.. షర్మిల.. కాంగ్రెస్ లో ఉంటూ.. కూటమికి కోవర్టు గా వ్యవహరిస్తున్నారని సుంకర వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యల నేపథ్యంలోనే పార్టీ సుంకర పద్మశ్రీని పార్టీ నుంచి కొన్నాళ్లు పక్కన పెట్టగా.. సాకే స్వయంగా బయటకు వచ్చారు. మరి ఇప్పుడు ఏంజరుగుతుందో చూడాలి.