బిగ్ బాస్.. విదేశాలతో పాటు ఇండియాలోనూ అత్యంత ప్రజాదరణ కలిగిన టెలివిజన్ రియాలిటీ షో. మొదట హిందీలో బిగ్ బాస్ షో ప్రారంభమైంది. ఆ తర్వాత తెలుగు, తమిళ్, కన్నడ, మరాఠీ, మలయాళం, బెంగాలీ భాషలకు విస్తరించింది. ఈ రియాలిటీ షోలో వెండితెర, బుల్లితెర సెలబ్రిటీలకే కాకుండా సోషల్ మీడియా స్టార్స్, సామాన్యులకు కూడా అవకాశం కల్పిస్తున్నారు. ఇదే అదునుగా కొందరు కేటుగాళ్లు ఘరానా మోసాలకు పాల్పడుతున్నారు.
తాజాగా బిగ్‌బాస్ షో పేరుతో ఓ డాక్టర్ ను నిండా ముంచేశారు. బిగ్‌బాస్ లో కంటెస్టెంట్ గా అవకాశం కల్పిస్తానని చెప్పి రూ. 10 లక్షలు టోకరా వేశాడో కేటుగాడు. ఈ ఘటన మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్ లో చోటుచేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. అభినిత్ గుప్తా అనే వ్యక్తి భోపాల్ లో ప్రముఖ చర్మవ్యాధి నిపుణుడు. ఈయన పాయిజన్ స్కిన్ క్లినిక్ ను నడుపుతున్నాడు. అయితే 2022లో కరణ్ సింగ్ అనే వ్యక్తి డాక్టర్ అభినిత్ గుప్తాను సంప్రదించాడు. ఇద్దరి మధ్య మాటలు కలిశాయి.
ఈ క్రమంలోనే తాను ఈవెంట్ డైరెక్టర్‌నని, టీవీ నిర్మాణ సంస్థలతో బలమైన సంబంధాలు ఉన్నాయని కరణ్ సింగ్ నమ్మపలికాడు. డాక్టర్ గుప్తాతో సన్నిహితంగా ఉండటం ప్రారంభించాడు. అక్కడితో ఆగకుండా బిగ్‌బాస్ షోలో ఛాన్స్ కల్పిస్తానని కరణ్ సింగ్ హామీ ఇచ్చాడు. అతని మాటలు గుడ్డిగా నమ్మిన డాక్టర్ గుప్తా.. కరణ్ సింగ్ కు రూ. 10 లక్షలు చెల్లించాడు.
కట్ చేస్తే ఇటీవల విడుదలైన బిగ్‌బాస్ షో కంటెస్టెంట్ల లిస్ట్ లో డాక్టర్ గుప్తా పేరు లేదు. దీంతో కరణ్ సింగ్‌ను నిలదీయగా.. బ్యాక్‌డోర్ పద్ధతి ద్వారా ఛాన్స్ వస్తుందని మాయ మాటలు చెప్పాడు. కానీ ఎన్ని రోజులు గడిచినా ఛాన్స్ రాకపోవడంతో తన డబ్బు తనకు తిరిగి చెల్లించాలని కరణ్‌ను డాక్టర్ గుప్తా డిమాండ్ చేశాడు. ఆ దెబ్బతో కరణ్ ఫోన్‌ను స్విచ్చాఫ్ చేసుకున్నాడు. ఇక మోసపోయానని గ్రహించిన డాక్టర్ గుప్తా పోలీసులను ఆశ్రయించారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ప్రస్తుతం ఈ ఘటన స్థానికంగానే కాకుండా సోషల్ మీడియాలోనూ తెగ వైరల్ అవుతోంది.