వైసీపీ హయాంలో లిక్కర్ స్కామ్ జరిగిందని ఆరోపణలు వస్తున్న సంగతి తెలిసిందే. మద్యం అంటేనే ఆదాయం అనే రీతిలో వైసీపీ నేతలు దోపిడీకి పాల్పడ్డారని విమర్శలు వచ్చాయి. ఈ క్రమంలోనే తాజాగా ఏపీలో లిక్కర్ పాలసీపై సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. దేశంలో ఏ రాష్ట్ర ప్రభుత్వమైనా మద్యాన్ని ఆదాయవనరుగా చూస్తాయని, కానీ మద్యం పాలసీ అంటే ఆదాయం మాత్రమే కాదని, ప్రజల ఆరోగ్యం కూడా ముఖ్యమని అన్నారు.
ఆల్కహాల్ కంటెంట్ తక్కువ ఉన్న మద్యం ద్వారా మద్యం వినియోగదారుల ఆరోగ్యాన్ని చాలా వరకు కాపాడొచ్చని అన్నారు. జగన్ హయాంలో నాణ్యత లేని మద్యం వల్ల కొన్ని లక్షల కుటుంబాలు నష్టపోయాయని గుర్తు చేశారు. పేదల ఇల్లు, ఒళ్లు గుల్ల కాకుండా చూడాల్సిన అవసరముందని చెప్పారు.
ప్రస్తుతం ఉన్న బార్ పాలసీ గడువు తీరడంతో సెప్టెంబర్ 1 నుంచి కొత్త బార్ పాలసీకి రూపకల్పన చేసినట్లు తెలిపారు. గతంలో మన రాష్ట్రంలో నాణ్యమైన మద్యం లేకపోవడం, అధిక ధరలు, మంచి బ్రాండ్లు దొరక్క పోవడం వల్ల ఇక్కడి వాళ్లు పొరుగు రాష్ట్రాలకు వెళ్లి మద్యం తెచ్చుకునేవారని, ఇప్పుడు ఆ బాధ లేదని చెప్పారు.
ఏపీలో 840 బార్లు ఉండగా....కొత్త పాలసీలో లాటరీ పద్దతి ద్వారా వాటికి అనుమతులిస్తారు. 50 వేల లోపు జనాభా ఉంటే రూ.35 లక్షలు, 5 లక్షల లోపు జనాభా ఉంటే రూ.55 లక్షలు, 5 లక్షల పైన జనాభా ఉంటే రూ.75 లక్షల చొప్పున ఏడాదికి లైసెన్స్ ఫీజు పెట్టాలన్న ప్రతిపాదన వచ్చింది. అప్లికేషన్ ఫీజ్, లైసెన్స్ ఫీజు ద్వారా రూ.700 కోట్ల ఆదాయం వస్తుందని అంచనా