వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ పై మంత్రి పార్థ సారధి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. కూటమి ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమం చూసి జగన్ లో ఫ్రస్టేషన్ పెరిగిపోయిందని విమర్శించారు. అందుకే, జగన్ వ్యక్తిగత విమర్శలకు దిగుతున్నాడని ఆరోపించారు.
వైసీపీ నేతల తీరు, వారి విధ్వంసకర విధానాలు చూసి బాధపడుతున్నానని అన్నారు. అధికార పక్షాన్ని కించపరిచే కోసం అరాచక శక్తులని ప్రోత్సహించడం ఎప్పుడూ చూడలేదన్నారు. వై నాట్ 175 అన్న జగన్ 11 స్థానాలకు పడిపోవడంతో ఈ విధంగా అనైతికంగా, అప్రజాస్వామికంగా ప్రవర్తిస్తున్నారని ఆరోపించారు. క్రింది స్థాయి నాయకులకు ఆదర్శంగా ఉండాల్సిన జగన్ ఈ విధంగా మాట్లాడడం బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు.
వైఎస్సార్, రోశయ్య, కిరణ్ కుమార్ రెడ్డి, చంద్రబాబులతో కలిసి పనిచేశానని...కానీ, జగన్ వేరని అన్నారు. కక్షపూరిత రాజకీయాలు వద్దని చంద్రబాబు చెబుతున్నారని అన్నారు. గంజాయికి బానిసై సమాజంలో అరాచకాలు సృష్టిస్తూ ఆడపిల్లల్ని హింసిస్తున్న వారి మీద పోలీసులు చర్యలు తీసుకుంటే జగన్ వెళ్లి వారిని పరామర్శించడం ఏంటని మండిపడ్డారు. శాసన సభ్యురాలు ప్రశాంతి రెడ్డి గురించి నీచాతి నీచంగా దిగజారి మాట్లాడిన వ్యక్తిని మందలించకుండా పరామర్శిస్తున్నాడంటే ఏమనుకోవాలని ప్రశ్నించారు.