``ఎవరికీ అనుమానం అవసరం లేదు. అటు కేంద్రంలోను.. ఇటు రాష్ట్రంలోనూ కూటమి మరోసారి అధికారంలోకి వస్తుంది. అప్పుడే అభివృద్ధి కొనసాగుతుంది.`` అని సీఎం చంద్రబాబు తేల్చి చెప్పారు. తాజాగా ఆయన ఉమ్మడి ప్రకాశం జిల్లాలో పర్యటించారు. ఈ సందర్భంగా.. `అన్నదాత సుఖీభవ-పీఎం కిసాన్` పథకం తొలి విడత నిధులను ఆయన విడుదల చేశారు. ప్రస్తుతం పీఎం కిసాన్ ద్వారా కేంద్రం రూ.2000, రాష్ట్ర ప్రభుత్వం అన్నదాత సుఖీభవ పథకం కింద 5000 రూపాయలను రైతుల ఖాతాల్లో జమ చేసింది. అనంతరం .. చంద్రబాబు రైతులను ఉద్దేశించి మాట్లాడారు.
కేంద్రంలో మూడు దఫాలుగా ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ నేతృత్వంలోని సుస్థిర ప్రబుత్వం కొనసాగుతున్నందునే.. దేశంలో అభివృద్ధి పరుగులు పెడుతోందన్నారు. దూరదృష్టిగల ప్రధాన మంత్రి మనకు ఉండడం అదృష్టమని వ్యాఖ్యానించారు. అదేవిధం గా రాష్ట్రంలోనూ మూడు పార్టీలతో ఏర్పడిన కూటమి ప్రభుత్వంకూడా.. సుస్థిరంగానే ఉంటుందన్నారు. వచ్చే ఎన్నికల్లోనూ కూటమి పార్టీలదే విజయమని తేల్చి చెప్పారు. ``ఒక విధ్వంసుకుడిని అధికారంలో నుంచి దింపేందుకు..మూడు పార్టీలు జత కట్టాయి. పవన్ కల్యాణ్ ముందుకు వచ్చి చేతులు కలిపారు. రాష్ట్రం కోసం.. ఆయన త్యాగం చేశారు. కూటమి విజయం దక్కించుకుంది. మళ్లీ మరోసారి కూడా కూటమి గెలిచి తీరుతుంది.`` అని చంద్రబాబు ఉద్ఘాటించారు.
రాష్ట్రంలో 2019లో ఏర్పడిన వైసీపీ ప్రభుత్వం అన్ని వ్యవస్థలను భగ్నం చేసిందని చంద్రబాబు వ్యాఖ్యానించారు. ఆ వ్యవస్థలను ఒక్కొక్కటి తిరిగి గాడిలో పెట్టేందుకు తనకు ఏడాది సమయం పట్టిందన్నారు. ఇంకా.. కొన్ని వ్యవస్థలను బాగు చేయాల్సి ఉందన్నారు. వచ్చే ఎన్నికల్లోనూ కూటమి గెలిచి తీరుతుందని.. అప్పటికి రాష్ట్రం అభివృద్ధి పథంలో ముందుకు సాగుతుందని చెప్పారు. ప్రజలు కూడా ఆలోచన చేయాలన్నారు. సుస్థిర ప్రభుత్వాలను ఏర్పాటు చేసుకున్న గుజరాత్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాలు అభివృద్ధిలో దూసుకుపోతున్నాయని వెల్లడించారు. ఏపీలోనూ అలాంటి ప్రభుత్వానికే ప్రజలు పట్టం కట్టాలన్నారు.
మాది రైతు ప్రభుత్వం..
తమది రైతు ప్రభుత్వమని సీఎం చంద్రబాబు చెప్పారు. రైతులకు ఎన్నోచేస్తున్నామన్నారు. గత ప్రభుత్వం 26 వేల కోట్ల రూపా యలు బకాయి పెట్టి పోతే.. వాటిని కూడా రైతులకు జమ చేశామన్నారు. ``సంపద సృష్టిస్తామని హామీ ఇచ్చాం. ఇప్పటికే 12 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు వచ్చాయి. మరిన్ని వస్తున్నాయి. దాంతో సంపద పెరుగుతుంది. వాటిని పేదలకు పంపిణీ చేస్తాం. ప్రజల కోసం.. రైతుల కోసం.. మరింతగా కష్టపడుతున్నాం. కూటమి ప్రభుత్వం రైతుల పక్షపాతిగా వ్యవహరిస్తోంది. రైతుల సమస్యలను నేరుగా పరిశీలించి పరిష్కరించే బాధ్యతను నేను తీసుకుంటున్నా`` అని చంద్రబాబు భరోసా కల్పించారు.