మాజీ మంత్రి, వైసీపీ ఫైర్ బ్రాండ్ లీడర్ కొడాలి నానికి బిగ్ షాక్ తగిలింది, రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఇప్పటికే పలు కేసుల్లో చిక్కుకున్న కొడాలి నాని పై తాజాగా మరో కేసు నమోదు అయింది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఆయన కుటుంబ సభ్యులపై అసభ్యకర వ్యాఖ్యలు చేయడమే కాకుండా వారిని కించపరిచేలా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారంటూ 2024లో విశాఖపట్నం త్రీ టౌన్ పోలీసులకు ఏయూ న్యాయ కళాశాల విద్యార్థిని అంజన ప్రియ అనే యువతి ఫిర్యాదు చేశారు.
ఆమె ఫిర్యాదు ఆధారంగా కోడాలి నానిపై విశాఖపట్నం పోలీసులు భారతీయ న్యాయ విభాగంలోని U/S 353(2), 352, 351(4), 196(1) BNS 467 సెక్షన్లు అలాగే ఐటీ యాక్ట్ కింద కేసులు నమోదు చేశారు. ఈ కేసుకు సంబంధించిన 41 సీఆర్పీసీ నోటీసులను ఆదివారం కృష్ణా జిల్లా గుడివాడలోని కొడాలి నాని ఇంటికి వెళ్లి పోలీసులు అందజేశారు. విచారణకు హాజరు కావాలని నోటీసుల్లో పేర్కొన్నారు.
అయితే ఈ పరిణామంతో వైసీపీ వర్గం భగ్గుమంది. వైసీపీ నేతలే టార్గెట్ గా కూటమి ప్రభుత్వం అక్రమ కేసులు పెడుతోందని.. కక్ష సాధింపు చర్యలలో భాగంగానే కొడాలి నానిపై తాజాగా కేసు నమోదు చేశారని ఫ్యాన్ పార్టీ మరియు ఆ పార్టీ అనుకూల మీడియా ఆరోపిస్తోంది.