సోషల్ మీడియాలో తన మీద హద్దులు దాటి కామెంట్లు చేసే వాళ్లకు గట్టిగా బుద్ధి చెబుతూ ఉంటుంది నటి, యాంకర్ అనసూయ. ఐతే ఇప్పుడు ఒక కార్యక్రమం కోసం వెళ్లిన ఆమె.. స్టేజ్ మీది నుంచే ఇలాంటి అల్లరి బ్యాచ్‌ను తీవ్ర స్థాయిలో హెచ్చరించింది. ‘‘చెప్పు తెగుద్ది.. చెప్పు తెగుద్ది’’ అంటూ ఆమె వార్నింగ్ ఇవ్వడం చర్చనీయాంశంగా మారింది. అనసూయ తాజాగా ఆంధ్రప్రదేశ్‌లోని ప్రకాశం జిల్లా మార్కాపురంలో ఒక షాపింగ్ మాల్ ఓపెనింగ్‌కు అతిథిగా వెళ్లింది.
ఆ సందర్భంగా ఆమె స్టేజ్ మీద మాట్లాడుతుంటే.. కొందరు తుంటరి కుర్రాళ్లు ఆమె ముందే నిలబడి అభ్యంతర వ్యాఖ్యలు చేశారు. దీంతో అనసూయకు చిర్రెత్తుకొచ్చింది. ఆ కోపాన్ని ఆమె ఆపుకోకుండా, ఆ కుర్రాళ్లను చూస్తూ.. ‘‘చెప్పు తెగుద్ది.. చెప్పు తెగుద్ది’’ అంటూ గట్టి వార్నింగ్ ఇచ్చింది. అంతటితో ఆగకుండా.. మీ దగ్గరికి వచ్చి నిజంగానే ఈ పని చేసి చూపించడానికి కూడా తాను వెనుకాడనని అనసూయ వార్నింగ్ ఇచ్చింది. ఆ తర్వాత ఆ కుర్రాళ్లకు క్లాస్ పీకింది.
మహిళలను ఎలా గౌరవించాలో తెలియదా.. మీ అమ్మనో, అక్కనో ఎవరైనా ఇలాగే కామెంట్ చేస్తే మీకెలా ఉంటుంది.. వాళ్లను అగౌరవపరిస్తే మీరు ఊరుకుంటారా అని అనసూయ ప్రశ్నించింది. తాను తనను అభిమానించే వారి కోసం ఏడు గంటల పాటు ప్రయాణం చేసి ఎంతో దూరం నుంచి ఇక్కడికి వచ్చానని.. ఇంత ప్రేమగా వ్యవహరిస్తే తనతో ఇలాగేనా ప్రవర్తించేది అని అనసూయ ప్రశ్నించింది.
మీరంతా చిన్న పిల్లలు.. ఇప్పుడే ఇలా ఉన్నారంటే రేప్పొద్దున పెద్దయ్యాక ఎలా ప్రవర్తిస్తారు అంటూ ఆమె ఆందోళన వ్యక్తం చేసింది. ఇక్కడ అల్లరి చేస్తున్న కుర్రాళ్లందరినీ బయటికి పంపించాలని నిర్వాహకులను ఆమె కోరింది. అంతలో కొందరు అత్తా అత్తా అంటూ అరిచేసరికి ఆమె కూల్ అయి నవ్వేసింది.