టాలీవుడ్ రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ నుంచి తాజాగా వచ్చిన చిత్రం `కింగ్డమ్`. గౌతమ్ తిన్ననూరి డైరెక్ట్ చేసిన ఈ యాక్షన్ డ్రామాలో భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్‌గా నటించింది. సత్యదేవ్, వెంకటేశ్ తదితరులు ఇతర ముఖ్యమైన పాత్రలను పోషించగా.. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్లపై సూర్యదేవర నాగ వంశీ, సాయి సౌజన్య సంయుక్తంగా నిర్మించారు. భారీ అంచనాల నడుమ జూలై 31న విడుదలైన కింగ్డమ్ మూవీ అభిమానుల మెప్పుతో పాటు ప్రేక్షకుల ప్రశంసలు అందుకుంటోంది. బాక్సాఫీస్ వద్ద సాలిడ్ వసూళ్లను సొంతం చేసుకుంటోంది.
ఈ నేపథ్యంలోనే తాజాగా హైదరాబాద్‌లో విజయ్ దేవరకొండ విలేకర్లతో చిట్ చాట్ చేశాడు. మీడియా వారు అడిగిన అన్ని ప్రశ్నలకు చాలా ఓపిగ్గా సమాధానం చెప్పాడు. కింగ్డమ్ మూవీ విశేషాలే కాకుండా తన అప్ కమింగ్ ప్రాజెక్ట్స్ వివరాలను విల్లడించారు. ఈ క్రమంలోనే కింగ్డమ్‌కు ఫస్ట్ అనుకున్న టైటిల్ ఏంటో రివీల్ చేసి అందర్నీ ఆశ్చర్యపరిచాడు. నిజానికి డైరెక్టర్ గౌతమ్ తిన్ననూరి ఈ చిత్రానికి `దేవర నాయక` అనే టైటిల్ ను ఖరారు చేయాలని భావించారట.
అయితే ఎన్టీఆర్ `దేవర` కోసం తమ టైటిల్ ను త్యాగం చేశామని తాజాగా విజయ్ దేవరకొండ వెల్లడించారు. అలాగే `కింగ్డమ్ 2` కచ్చితంగా ఉంటుందని.. సెకండ్ పార్ట్‌లో ఒక తేగకు చెందిన నాయకుడు దేవర నాయకగా ఎలా ఎదిగాడు అన్న దాని గురించి ఉంటుందని విజయ్ పేర్కొన్నాడు. కింగ్డమ్ 2లో ఓ పెద్ద స్టార్ హీరో ఉంటాడని.. అదెవరన్నది గౌతమ్ చెప్తాడని విజయ్ తెలిపారు. ప్రస్తుతం ఈయన కామెంట్స్ నెట్టింట వైరల్ గా మారాయి.