ఐపీఎస్ అధికారి, ఏపీ కేడర్‌కు చెందిన సీఐడీ మాజీ చీఫ్ సంజయ్ బెయిల్ రద్దు చేస్తూ.. సుప్రీంకోర్టు కీలక తీర్పు వెలువరించింది. ఆయనకు ఏపీ హైకోర్టు ముందస్తు బెయిల్ ఇచ్చిన విధానాన్ని కూడా సుప్రీం కోర్టు తప్పుబట్టింది. గతంలోనే మొత్తం ట్రయల్ పూర్తి చేసినట్టుగా ఉందంటూ.. ముందస్తు బెయిల్‌పై వ్యాఖ్యలు చేసిన కోర్టు.. తాజాగా సదరు బెయిల్‌ను రద్దు చేస్తూ ఉత్తర్వులు జారీచేసింది. ఇదే సమయంలో ఆయన కోర్టు ముందు లొంగిపోవాలని ఆదేశించింది.
అయితే.. దీనికి మూడు వారాల సమయం ఇచ్చింది. అంతేకాదు.. సంజయ్‌ను అదుపులోకి తీసుకుని విచారించేందుకు దర్యాప్తు అధికారులకు స్వేచ్ఛ ఇస్తున్నట్టు తెలిపింది. ఒకవేళ మరోసారి బెయిల్ కావాలని సంజయ్ కోరుకుంటే.. ఆయన నేరుగా హైకోర్టుకు కాకుండా.. మేజిస్ట్రేట్ కోర్టులో పిటిషన్ దాఖలు చేసుకోవాలని సుప్రీంకోర్టు తేల్చి చెప్పింది. ఈ మేరకు జస్టిస్ అమానుతుల్లా, జస్టిస్ ఎస్.వి.ఎన్ భట్టి ధర్మాసనం తీర్పు వెలువరించింది.
ఏంటీ కేసు?
సంజయ్ వైసీపీ హయాంలో అగ్నిమాపక శాఖ ఐజీగా పనిచేశారు. ఒక వైపు సీఐడీచీఫ్‌గాను, మరో వైపు అగ్నిమాపక శాఖ ఐజీగా కూడా ఆయన బాధ్యతలు నిర్వర్తించారు. అగ్నిమాపక శాఖకు సంబంధించిన అనుమతులు ఇచ్చే విషయంపై నూతన సాంకేతికతను ఆయన అందుబాటులోకి తీసుకువచ్చారు. దీనిలో అగ్ని-ఎన్‌వోసీ వెబ్ సైట్, యాప్‌ను తీసుకువచ్చే ప్రయత్నం చేశారు. వీటిని రూపొందించేందుకు సౌత్రిక టెక్నాలజీస్ కు బాధ్యతలు అప్పగించారు. అయితే.. ఈ సంస్థ.. అనుకున్న విధంగా పనులు చేయలేదు. అయినా కూడా.. సంజయ్ 60 లక్షల రూపాయలను ఆ సంస్థకు రెండు దఫాలుగా చెల్లించారు.
ఇక, సీఐడీ చీఫ్‌గా ఆయన.. గంజాయి నిర్మూలన.. మాదకద్రవ్యాలు, సంఘ విద్రోహ శక్తులకు దూరంగా ఉండేలా గిరిజనులకు శిక్షణ ఇవ్వాలని నిర్ణయించుకున్నారు. ఈ బాధ్యతలను క్రిత్వ్యాప్ టెక్నాలజీస్‌కు ఇచ్చారు. ఈ క్రమంలో ఈ సంస్థకు కోటీ 20 లక్షలు చెల్లించారు. కానీ, ఈ సంస్థ ఎక్కడా గిరిజనులకు శిక్షణ ఇవ్వలేదు. పోలీసులు, సీఐడీ అధికారులే శిక్షణ ఇచ్చారు. కానీ, నిధులు మాత్రం చెల్లించారు.
ఇవీ సంజయ్‌పై ఉన్న రెండు కేసులు. కూటమి సర్కారు వచ్చాక.. దీనిపై విచారణ చేసింది. మొత్తంగా దాదాపు 2 కోట్ల రూపాయలను దుర్వినియోగం చేశారన్నది సంజయ్‌పై నమోదైన కేసు. ఈ కేసులోనే ఆయన గతంలో ముందస్తు బెయిల్ తెచ్చుకున్నారు.కానీ.. పోలీసులు దీనిని సుప్రీంకోర్టులో సవాల్ చేయగా.. బెయిల్ రద్దయింది.