ఏపీ డిప్యూటీ సీఎంగా బాధ్యతలు చేపట్టిన తర్వాత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నుంచి వచ్చిన తొలి చిత్రం `హరిహర వీరమల్లు`. క్రిష్ జాగర్లమూడి, జ్యోతి కృష్ణ డైరెక్ట్ చేసిన ఈ పిరియాడిక్ యాక్షన్ డ్రామాలో నిధి అగర్వాల్ హీరోయిన్ గా నటించింది. భారీ అంచనాల నడుమ జూలై 24న విడుదలైన ఈ చిత్రానికి మిక్స్డ్ టాక్ లభించింది. పవన్ కళ్యాణ్ క్రేజ్ దృష్యా మంచి ఓపెనింగ్స్ తో థియేట్రికల్ రన్ ను ప్రారంభించిన హరిహర వీరమల్లు.. యావరేజ్ కలెక్షన్స్ తో మొదటి వారాన్ని ముగించింది.
వీరమల్లు ఫస్ట్ వీక్ కలెక్షన్స్ ను గమనిస్తే.. ఏపీ మరియు తెలంగాణలో ఈ చిత్రం రూ. 56.14 కోట్ల షేర్, రూ. 82.35 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ ను సొంతం చేసుకుంది. అలాగే కర్ణాటక మరియు రెస్టాఫ్ ఇండియాలో రూ. 4.98 కోట్లు, ఓవర్సీస్ లో రూ. 6.28 కోట్లు వసూళ్లు వచ్చాయి. వారం రోజుల థియేట్రికల్ రన్ ముగిసే సమయానికి వీరమల్లు రూ. 67.40 కోట్ల షేర్, రూ. 110.30 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ ను రాబట్టింది.
ప్రపంచవ్యాప్తంగా రూ. 126 కోట్ల రేంజ్‌లో ప్రీ రిలీజ్ బిజినెస్ సొంతం చేసుకున్న హరి హర వీరమల్లు రూ. 127.50 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్‌తో బరిలోకి దిగింది. అయితే ఈ టార్గెట్ ను రీచ్ కావాలంటే ఇంకా రూ. 60.10 కోట్ల షేర్ ను రాబట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మరి ఫుల్ రన్‌లో పవన్ లేటెస్ట్ ఫిల్మ్ బ్రేక్ ఈవెన్ అవుతుందా? లేదా? అన్నది చూడాలి. కాగా, సినిమా రిలీజ్ తర్వాత సెకండాఫ్‌లో సాగదీత సన్నివేశాలు మరియు వీఎఫ్‌ఎక్స్ విషయంతో చాలా విమర్శలు రావడంతో కొన్ని సన్నివేశాలను ట్రిమ్ చేయడమే కాకుండా కొత్త విజువల్ ఎఫెక్ట్స్‌తో మళ్ళీ రిలీజ్ చేశారు. కొత్త వర్షన్ విజయవంతంగా ప్రదర్శితమవుతుంది. ఇకపోతే ఆగస్ట్ 1న హిందీ డబ్ వర్షన్ ను రిలీజ్ చేయనున్నారు.