కుమారుడు జన్మించినపుడు తండ్రికి కలిగే సంతోషం కన్నా...ఆ కుమారుడు ప్రయోజకుడైనప్పుడే ఆ తండ్రికి నిజమైన పుత్రోత్సాహం కలుగుతుంది. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుకు కూడా ప్రస్తుతం ఆ పుత్రోత్సాహం కలుగుతోందనడంలో సందేహం లేదు. తండ్రికి తగ్గ తనయుడిగా మంత్రి నారా లోకేశ్ రాటుదేలిన వైనం ప్రశంసనీయం. తాజాగా సింగపూర్ పర్యటనలో సీఎం చంద్రబాబుతో పోటీ పడి మరీ ఏపీకి పెట్టుబడులు తేవడంలో లోకేశ్ సక్సెస్ అయ్యారు. లోకేశ్ చొరవతోనే ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు గూగుల్ ముందుకు వచ్చిందని తెలుస్తోంది.
ఏపీలో గూగుల్ సంస్థ భారీ డేటా సెంటర్ ఏర్పాటు చేయబోతున్నట్టు తెలుస్తోంది. 6 బిలియన్ డాలర్లు (దాదాపు రూ.50,000 కోట్లు) పెట్టుబడితో విశాఖలో 1 గిగా బైట్ సామర్థ్యంతో డేటా సెంటర్ ను గూగుల్ సంస్థ ఏర్పాటు చేయనుందని తెలుస్తోంది. ఇండియాలో ఇంత భారీ స్థాయిలో గూగుల్ పెట్టుబడి పెట్టడం తొలిసారి కావచ్చు. ఆసియా ఖండంలో ఇంత పెద్ద డేటా సెంటర్‌ను ఏర్పాటు చేయడం కూడా తొలిసారి అయ్యే అవకాశముంది.
4 రోజుల సింగపూర్ పర్యటన ముగించుకొని గురువారం తెల్లవారుఝామున లోకేశ్ గన్నవరం విమానాశ్రయంలో ల్యాండ్ అయ్యారు. ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు పలువురు పారిశ్రామికవేత్తలను లోకేశ్ ఆహ్వానించారు. ఏపీలో కంపెనీలె పెట్టేందుకు ఉన్న అనుకూలతలను వివరించి పెట్టుబడిదారులలలో విశ్వాసాన్ని నింపడంలో సక్సెస్ అయ్యారు. లోకేశ్ స్పీచ్ కు సింగపూర్ ప్రభుత్వ పెద్దలు, పారిశ్రామికవేత్తలు ఫిదా అయ్యారు. సీఎం చంద్రబాబుతో కొన్ని, విడిగా మరికొన్ని కార్యక్రమాల్లో లోకేశ్ బిజీబిజీగా గడిపారు.
పారిశ్రామికవేత్తలతో వన్ టు వన్ చర్చలు 19, జి టు జి (గవర్నమెంట్ టు గవర్నమెంట్) సమావేశాలు 6, రౌండ్ టేబుల్ సమావేశాలు 4, సైట్ విజిట్లు 4, రోడ్ షో/డయాస్పోరా ఈవెంట్స్ 2....మొత్తం 35 కార్యక్రమాలకు లోకేష్ హాజరయ్యారు.
సీఎం చంద్రబాబు నేతృత్వంలో సింగపూర్ వెళ్లిన మంత్రుల బృందానికి ప్రవాసాంధ్రులు మొదలు సింగపూర్ అధ్యక్షుడు ధర్మన్ షణ్ముగ రత్నం వరకు అపూర్వ స్వాగతం లభించింది. తెలుగు డయాస్పోరా సమావేశంలో లోకేశ్ స్పీచ్ ఎన్ఆర్ఐలలో స్పూర్తి నింపింది. ఏపీ బ్రాండ్ ను ప్రమోట్ చేయడంలో ఎన్ఆర్ఐలు బ్రాండ్ అంబాసిడర్లుగా మారాలని లోకేశ్ పిలుపునిచ్చారు. ఎయిర్ బస్, ఎవర్ వోల్ట్, గూగుల్ క్లౌడ్, మైక్రో సాఫ్ట్, మురాటా ఇంజనీరింగ్, కెరియర్, ఇన్ఫినియన్, ఐవిపి సెమి, క్యాపిటా ల్యాండ్, ఎబీమ్ కన్సల్టింగ్, డిటిడిఎస్ వంటి గ్లోబల్ కంపెనీల ప్రతినిధులతో లోకేశ్ జరిపిన చర్చలు సఫలమయ్యాయి.