అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేస్తున్న వ్యాఖ్యలు, తీసుకుంటున్న నిర్ణయాలు భారత్‌కు తీవ్ర సంకటంగా పరిణమించాయి. ఇప్పటికే ఆయన ఆపరేషన్ సిందూర్‌ను నేనే ఆపాను.. భారత్‌ను హెచ్చరించాను.. కాబట్టే పాక్, భారత్‌లు కాల్పుల విరమణ పాటిస్తున్నాయని ప్రకటించి.. సంచలనం రేపారు. దీంతో పార్లమెంటు వేదిగా మోడీ సర్కారు తీవ్ర ఇరకాటంలో పడింది. ఇక, ఇప్పుడు మరోరూపంలో ట్రంప్ భారత్‌కు వాతలు పెట్టే కార్యక్రమానికి తెరదీశారు. పైగా.. ఆయన భారత్ను మిత్రదేశం అంటూనే సంచలన నిర్ణయం తీసుకోవడం గమనార్హం.
ఆగస్టు 1వ తేదీ నుంచి భారత్‌తో చేస్తున్న వాణిజ్యంపై సుంకాలను 25 శాతానికి పెంచుతున్నట్టు ట్రంప్ చెప్పారు. అంతేకాదు.. దీనికి అదనంగా పెనాల్టీ(ఎందుకో చెప్పలేదు) కూడా విధిస్తున్నామని.. ట్రంప్ పేర్కొన్నారు ఈ మేరకు .. ఆయన తన సొంత సామాజిక మాధ్యమం `ట్రూత్ సోషల్`లో పోస్టు చేశారు. వాస్తవానికి ఇప్పటికే ప్రపంచ దేశాల్లో సగానికిపైగా.. ఆయన సుంకాలను భారీగా పెంచారు. అయితే.. కొన్ని అభ్యర్థనలు.. అదేవిధంగా బ్రిక్స్ దేశాల ఆగ్రహంతో వెనక్కి తగ్గారు.కానీ, భారత్ ఈ విషయంలో మౌనంగా ఉంది. అసలు ట్రంప్ సుంకాలు పెంచుతానని ప్రకటించిన సమయంలో భారత్ స్పందించనేలేదు.
దీనిని అలుసుగా తీసుకున్నారో.. లేక.. భారత్ను శాసించాలని అనుకున్నారో తెలియదు కానీ.. తాజాగా సంచలన వ్యాఖ్యలే చేశారు. ఈ క్రమంలో కొన్నినిర్ణయాలు కూడా ప్రకటించారు. రష్యాకు అమెరికా వ్యతిరేకమని.. చెప్పిన ట్రంప్.. తాము ఆంక్షలు విధించిన తర్వాత కూడా.. భారత్.. రష్యాతో వాణిజ్యం చేస్తోందని వ్యాఖ్యానించారు. చైనా కూడా ఇదే బాటలో ఉందన్నారు. కానీ, ఈ దేశానికి మాత్రం సుంకాలపై హాలీడే ప్రకటించారు. భారత్‌పై మాత్రం అక్కసు వెళ్లగక్కుతూ.. భారత్.. తమపైనే ఎక్కువగా సుంకాలు విధిస్తోందని ట్రంప్ వ్యాఖ్యానించారు. ``భారత్ బీద దేశం కాదు. అక్కడ సంపద బాగానే ఉంది.`` అని గతంల చేసిన వ్యాఖ్యలను ట్రంప్ మరోసారి గుర్తు చేశారు.
భారత్‌తో చేస్తున్న వాణిజ్యాన్ని 30 శాతానికి తగ్గించేస్తున్నట్టు ప్రకటించారు. `అమెరికా విలువ తెలియాలంటే.. కొన్ని నిర్ణయాలు తీసుకోవాలి.`` అని గడుసుగా వ్యాఖ్యలు చేసిన ట్రంప్.. భారత్‌పై సుంకాలను 25 శాతం మేరకు పెంచుతున్నట్టు చెప్పారు. ఆగస్టు 1(శుక్రవారం) నుంచే ఈ విధింపు అమల్లోకి వస్తుందన్నారు. ప్రతీకార సుంకాలకు భారత్ సిద్ధం కావాలని సూచించారు. ఇది తమ విధానమని తేల్చి చెప్పారు. మరి దీనిపై ప్రధాని మోడీ ఎలా స్పందిస్తారనేది చూడాలి.