ఏపీ మహిళలకు కూటమి సర్కార్ ఆగస్టు 15న గొప్ప కానుక అందించేందుకు సిద్ధమయింది. ఎన్నికల సమయంలో ఇచ్చిన సూపర్ సిక్స్ హామీల్లో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం అతి ముఖ్యమైనది. అయితే స్వాతంత్ర్య దినోత్సవం రోజు ఈ స్త్రీ శక్తి స్కీమ్ రాష్ట్రవ్యాప్తంగా అమల్లోకి రాబోతోంది. తాజాగా ఆంధ్రప్రదేశ్ రోడ్డు రవాణా సంస్థ (ఏపీఎస్ ఆర్టీసీ) ఎండీ ద్వారక తిరుమలరావు ఈ స్కీమ్ కు సంబంధించిన పూర్తి వివరాలను వెల్లడించారు.
ఫ్రీ బస్ స్కీమ్ అమల్లోకి వచ్చినాక రాష్ట్రంలో మహిళలు ఎక్కడినుంచి ఎక్కడికైనా ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణించవచ్చు. అయితే ఆధార్ కార్డు అనేది తప్పనిసరి. అలాగే రాష్ట్ర ప్రభుత్వం ఐదు రకాల బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పిస్తోంది. పల్లె వెలుగు, అల్ట్రా పల్లె వెలుగు, ఎక్స్ప్రెస్, సిటీ ఆర్డినరీ, మెట్రో ఎక్స్ప్రెస్ వంటి బస్సులు ఈ జాబితాలో ఉన్నాయి.
అంతేకాకుండా మరో 1,050 కొత్త బస్సులను కూడా ఆర్టీసీలోకి రానున్నాయని ద్వారక తిరుమలరావు పేర్కొన్నారు. ఇకపోతే ఏపీఎస్ ఆర్టీసీ ఫ్రీ బస్ స్కీమ్ కు సంబంధించి నమూనా టికెట్‌ను ముద్రించింది. ఈ టికెట్‌పై డిపో పేరు, స్త్రీశక్తి పథకం, ఎక్కడి నుంచి ఎక్కడికి ప్రయాణిస్తున్నారు, టికెట్ ధర, ప్రభుత్వ రాయితీ వంటివి ముద్రించారు. రాయితీతో టికెట్ ధరను తీసేసి చెల్లించాల్సిన ధరను జీరోగా చూపించారు. ప్రస్తుతం ఈ నమూనా టికెట్ నెట్టింట వైరల్ గా మారింది.