కాంగ్రెస్ నాయకురాలు, కేరళ నుంచి పార్లమెంటుకు ప్రాతినిధ్యం వహిస్తున్న ప్రియాంక గాంధీ.. ఫస్ట్ టైమ్.. లోక్‌సభలో నిప్పులు చెరిగారు. మోడీ సర్కారును ఉక్కిరి బిక్కిరి చేశారు. `ఆపరేషన్ సిందూర్`పై మంగళవారం జరిగిన సుదీర్ఘ చర్చలో 12 నిమిషా లు మాట్లాడిన ప్రియాంక.. ఆసాంతం ప్రశ్నలతో ప్రభుత్వాన్ని ముంచెత్తారు. ``పహల్గాం ఉగ్రదాడికి బాధ్యులు ఎవరు? ప్రధానా? హోం మంత్రా? రక్షణ మంత్రా?`` అంటూ నిప్పులు చెరిగారు. ఎవరైనా దీనికి బాధ్యత వహించారా? రాజీనామా చేశారా? 142 కోట్ల మంది ప్రజలకు సమాధానం చెప్పారా? అని తీవ్రస్థాయిలో ప్రశ్నించారు.
ఇంగ్లీష్-హిందీ మిక్స్‌డ్ లాంగ్వేజ్‌లో మాట్లాడిన ప్రియాంక గాంధీ.. పదునైన వ్యాఖ్యలు చేశారు. పహల్గాం ఉగ్రదాడి జరిగినప్పు డు.. కేంద్రం ఏం చేసిందన్నారు. దాడి జరగడానికి రెండు వారాల ముందే.. పహల్గాం పర్యాటక ప్రాంతానికి సంబంధించిన టికెట్లను విక్రయించుకుని.. సొమ్ము చేసుకున్న ప్రభుత్వం.. అది సునిశిత ప్రాంత మని మరిచిపోయిందా? మరిచిపోయినట్టు నటించిందా? అని ప్రశ్నించారు. మతాన్ని.. పేర్లను కూడా అడిగి ఉగ్రవాదులు చెలరేగి చంపేశారని.. శుభం అనే వ్యక్తిని తన భార్య ముందే చంపేశారని.. ఇది మీకు కనిపించలేదా? అని నిలదీశారు. ``పర్యాటక ప్రాంతం. అందునా సరిహద్దుల్లో ఉగ్రవాదులు సంచరించే ప్రాంతంగా ముద్రపడిన పహల్గాంలో ఎందుకు భద్రత లేకుండా పోయింది?`` అని ప్రశ్నించారు.
అంతేకాదు.. ``మన హోం మంత్రి గంటకు పైగానే లెక్చర్ ఇచ్చారు(ఆపరేషన్ సిందూర్‌పై చర్చలో అమిత్ షా మాట్లాడారు). కానీ.. ఆయన పట్టపగలు ఈ దాడి ఎలా జరిగిందో చెప్పలేకపోయారు. ఆయన హోం మంత్రిగా ఎంత బాధ్యతగా పనిచేస్తున్నారో.. దీనిని బట్టి తెలుస్తోంది. ఎవరు ఈ దాడికి బాధ్యత వహిస్తారు?`` అని ప్రియాంక గాంధీ నిప్పులు చెరిగారు. అదేసమయంలో పహల్గాంలో శాంతి భద్రతలు నెలకొన్నాయన్న షా ప్రకటనను కూడా ఆమె తప్పుబట్టారు. శాంతి భద్రతలు నెలకొన్నాయని ఎలా చెబుతారని నిలదీశారు. పరిస్థితి చూస్తే.. చాలా దారుణంగా ఉందన్నారు. దీనిని చాలా ఉదాశీనంగా ఏదో పొరుగు దేశంలో జరిగినట్టుగా కేంద్రం భావిస్తోందని అన్నారు.
ఈ ఘటనకు బాధ్యులు ఎవరో ఇప్పటికీ తేల్చలేకపోయారని ప్రియాంక అన్నారు. నైతిక బాధ్యత వహించని నాయకులు దేశానికి జవాబుదారీగా ఎలా ఉంటారన్నారు. ప్రతి దానినీ రాజకీయం చేస్తున్నారన్న ఒక్క మాట తప్ప.. అసలు విషయాలను ప్రజలకు వివరించాలన్న స్పృహ లేకుండా పోయిందన్నారు. ఈ సమయంలో అధికార పక్షాల నుంచి కూడా.. ఎలాంటి విమర్శలు.. ప్రతివిమర్శలు లేకపోవడం గమనార్హం. ``బాధ్యులు ఎవరు? ఎందుకు రాజీనామా చేయలేదు`` అని ప్రియాంక ప్రశ్నించినప్పుడు.. లోక్‌సభ పిన్ డ్రాప్ సైలెంట్ అయిపోయింది. సభలో ఉన్న కేంద్ర మంత్రులు లిప్తకాలం పాటు ఒకరి మొహాలు ఒకరు చూసుకున్నారు. దీంతో ఫస్ట్ టైమ్ ప్రియాంక.. కేంద్రాన్ని ఉక్కిరి బిక్కిరి చేశారని .. జాతీయ మీడియా పేర్కొనడం గమనార్హం.