వివాదాలకు కేరాఫ్ అడ్రస్ గా నిలిచే సెలబ్రిటీలకు.. నటీనటులకు కొదవ లేదు. ప్రతి అంశంలోనూ వారికి సంబంధించిన ఒక రచ్చ చర్చగా మారుతూ ఉంటుంది. ఆ కోవలోకే వస్తుందన్న ముద్ర నటి కల్పిక సొంతంగా చెబుతుంటారు. తాజాగా ఆమె విడుదల చేసిన వీడియో వెనుక జరిగిందేమిటో తెలుసా? అంటూ కొత్త వాదనను వినిపిస్తున్నారు. ఇక్కడ.. ఫలానా జరిగింది.. ఇదే నిజమని చెప్పట్లేదు. కాకుంటే.. బయటకు కనిపించే వీడియో వెనుక ఫలానా రకంగా జరిగిందంటూ వినిపిస్తున్న వాదనను తెర మీదకు తీసుకురావటం.. ఈ సందర్భంగా కొన్నిలాజిక్కులకు సమాధానాలు అడుగుతున్న వారి వాదనను వినిపించాలన్నదే ఉద్దేశం.
ఇక్కడ మేం నటి కల్పిక తప్పు చేసిందని చెప్పట్లేదు. అలా అని ఎలాంటి తప్పు చేయలేదన్న జడ్జిమెంటు ఇవ్వట్లేదు. ఫలానా దారుణం జరిగిందన్న ఆమె వీడియోకు సంబంధించి.. ఆమె ఆరోపణలు ఎదుర్కొంటున్న వారి వాదనను కూడా తెలియజేస్తున్నామంతే. ఇంతకూ జరిగిందేమంటే.. నటి కల్పిక తాజాగా విడుదల చేసిన తన వీడియోలో.. తాను హైదరాబాద్ నగర శివారులోని మొయినాబాద్ లో ఉన్న ఒక రిసార్టుకు వెళ్లానని.. అక్కడి రిసార్టు సిబ్బంది తన పట్ల అసభ్యంగా వ్యవహరించారన్న ఆరోపణల్ని సంధించటం తెలిసిందే.
దీనిపై సదరు రిసార్టు వారు వినిపిస్తున్న వాదన విషయంలోకి వెళితే.. మొయినాబాద్ మండలంలోని కనకమామిడి రెవెన్యూలో బ్రౌన్ టౌన్ రిసార్టు ఒకటి ఉంది. దానికి మంచి పేరే ఉంది. ఇక్కడకు సోమవారం మధ్యాహ్నం వచ్చిన నటి కల్పిక తన రూంలోకి వెళ్లి లంచ్ చేశారని.. రాత్రి వేళలో రిసెప్షన్ లో ఉన్న సిబ్బందిని సిగరెట్లు అడిగినట్లుగా చెబుతున్నారు. అయితే.. దీనికి అక్కడి సిబ్బంది స్పందించలేదు.
అనంతరం రిసెప్షన్ కు వెళ్లి తన ఆగ్రహాన్ని వ్యక్తం చేసిన ఆమె.. రిసార్టు మేనేజర్ ప్రశ్నిస్తూ.. తన గదిలో వైఫై లేదని.. ఎలాంటి వసతులు లేవని.. కనీసం సిగరెట్లు తెచ్చివ్వమంటే కూడా తెచ్చివ్వలేదంటూ మండిపడి.. తాను అక్కడ ఉండలేనంటూ గది తాళాల్ని విసిరేసి వెళ్లిపోయినట్లు చెబుతున్నారు. అనంతరం ఆమె చేసిన వీడియోలో రిసార్టు సిబ్బంది తనపట్ల అసభ్యంగా వ్యవహరించినట్లుగా ఆరోపణలు చేశారు.
ఆమె వీడియోకు ఒక కౌంటర్ వినిపిస్తోంది. అదేమంటే.. రిసార్టు సిబ్బంది అసభ్యంగా వ్యవహరించి ఉంటే.. దానికి సంబంధించి పోలీసుల్ని సంప్రదించి కంప్లైంట్ చేయాలి కదా? అన్నది ప్రశ్న. జీరో ఎఫ్ఐఆర్ వసతి ఉంది కాబట్టి తప్పు జరిగిన చోటే ఫిర్యాదు చేయాల్సిన అవసరం లేదు. సిటీకి వచ్చిన తర్వాత కూడా చేయొచ్చు.కావాలంటే మొయిల్ కూడా చేయొచ్చు. కానీ.. అలా ఏమీ చేయలేదని చెబుతున్నారు. తమకు నటి కల్పిక నుంచి ఎలాంటి కంప్లైంట్ రాలేదని మొయినాబాద్ ఇన్ స్పెక్టర్ పవన్ కుమార్ రెడ్డి తెలిపటం గమనార్హం. మరి.. తన ఆరోపణలకు ప్రతిగా తెర మీదకు వచ్చిన ఈ వాదనకు నటి కల్పిక ఎలా రియాక్టు అవుతారు? ఆమె ఏం చెబుతారన్నది ఇప్పుడు ప్రశ్నగా మారింది.