గత వారం భారీ అంచనాల మధ్య ప్రేక్షకుల ముందుకు వచ్చింది హరిహర వీరమల్లు సినిమా. పవన్ కళ్యాణ్ సినిమా అంటే.. ముందు బజ్ ఎలా ఉన్నప్పటికీ, రిలీజ్ టైంకి రావాల్సిన హైప్ వచ్చేస్తుంది. పవన్ కెరీర్లోనే అత్యధిక కాలం చిత్రీకరణ దశలో ఉండి, పలుమార్లు వాయిదా పడడం ద్వారా చాలా నెగెటివిటీ తెచ్చుకున్నప్పటికీ.. రిలీజ్ టైంకి ప్రేక్షకులు ఈ సినిమా చూడడానికి ఉత్సాహంగానే కనిపించారు. ముందు రోజు స్పెషల్ ప్రిమియర్స్ వేస్తే వాటికి అదిరిపోయే స్పందన వచ్చింది.
రెండు తెలుగు రాష్ట్రాల్లో హౌస్ ఫుల్స్‌తో రన్ అయ్యాయి ఆ షోలు. ఆ షోల ద్వారా భారీ కలెక్షన్ కూడా వచ్చింది. ఇక తొలి రోజు సినిమాకు టాక్ బాలేకపోయినా, వసూళ్లు మెరుగ్గానే కనిపించాయి. దీంతో నిర్మాత, బయ్యర్లు సేఫ్ అయిపోతారనే ఆశలు కలిగాయి. కానీ శుక్రవారం పరిస్థితి మారిపోయింది. వసూళ్లు బాగా డ్రాప్ అయిపోయాయి. సినిమాకు కరెక్షన్లు ఏవో చేసి రీలోడెడ్ వెర్షన్ అంటూ టీం హడావుడి చేసినా వసూళ్లు పెద్దగా ఏమీ పుంజుకోలేదు. శని, ఆదివారాల్లో పర్వాలేదనిపించినా.. వీకెండ్ అయ్యాక వీరమల్లు పూర్తిగా చల్లబడిపోయింది.
సోమవారం నుంచి హరిహర వీరమల్లు నామమాత్రంగా నడుస్తోంది. ఈ సినిమా స్క్రీన్లు చాలా వరకు తగ్గించి కన్నడ అనువాదం, యానిమేషన్ మూవీ అయిన మహావతార నరసింహకు ఇచ్చేశారు. ఇటు ఏపీ, అటు తెలంగాణలో అదే పరిస్థితి. వీరమల్లు తక్కువ స్క్రీన్లు, షోలతో నడుస్తుండగా.. వాటికీ ఆక్యుపెన్సీలు అంతంతమాత్రంగా ఉన్నాయి. సాయంత్రం షోలకు కూడా 10-20 శాతం మాత్రమే థియేటర్లు నిండుతున్న పరిస్థితి. సోమవారం నుంచి వస్తున్న షేర్ చెప్పుకోదగ్గ స్థాయిలో లేదు. ఓవరాల్ గ్రాస్, షేర్‌లో దీన్ని కలిపినా పెద్దగా తేడా ఉండట్లేదు.
వీకెండ్ అయ్యేసరికి వంద కోట్ల గ్రాస్, రూ.60 కోట్ల మేర షేర్ రాబట్టిన హరిహర వీరమల్లు.. ఆ లెక్కలతోనే సరిపెట్టుకోవాల్సి వచ్చేలా ఉంది. తెలుగు రాష్ట్రాల అవతల అయితే ఈ సినిమా వాషౌట్ అయిపోయింది. ఏపీలో కూడా రాయలసీమలో సినిమా దారుణంగా పెర్ఫామ్ చేసింది. ఉత్తరాంధ్ర, నైజాం కాస్త మెరుగు. ఈ సినిమా మీద రూ.250 కోట్ల మేర బడ్జెట్ పెట్టినట్లు వార్తలు వచ్చాయి. ఐతే థియేటర్ల నుంచి అందులో నాలుగో వంతుకు మించి షేర్ రానట్లే.