అధికారుల లీలలు మామూలుగా ఉండవు. కొందరు చేసే తప్పులు ప్రభుత్వానికి కొత్త తిప్పలు తెచ్చి పెడుతుంటాయి. తాజాగా అలాంటి పరిస్థితే బిహార్ లో చోటు చేసుకుంది. ఒక కుక్కకు నివాస ధ్రువీకరణపత్రాన్నిజారీ చేయటం సంచలనంగా మారింది. అధికారుల పని తీరు ఎలా ఉందనటానికి నిదర్శనంగా ఈ ఉదంతం చోటు చేసుకుంది. బిహార్ లోని మసౌర్హి డివిజన్ లో ఈ విచిత్ర ఘటన చోటు చేసుకుంది. జులై 24న ఈ రెసిడెన్స్ సర్టిఫికేట్ జారీ చేశారు.
కుక్క పేరును డాగ్ బాబుగా.. తండ్రి పేరును కుట్ట బాబు.. తల్లిపేరు కుటియా దేవిగా పేర్కొంటూ నివాస ధ్రువపత్రాన్ని జారీ చేశారు. దీనికి సంబంధించిన ఫోటో సోషల్ మీడియాలో పోస్టు చేయటంతో రాజకీయ రచ్చ మొదలైంది ఈ ఉదంతం బిహార్ రాజకీయాల్లో దుమారాన్ని రేపింది. రాష్ట్ర ప్రభుత్వం మీదా.. అధికారుల పని తీరుపై పెద్ద ఎత్తున విమర్శలు వ్యక్తమవుతున్నాయి. దీంతో స్పందించిన ప్రభుత్వం కుక్కకు జారీ చేసిన రెసిడెన్సీ సర్టిఫికేట్ ను రద్దు చేశారు.
అంతేకాదు.. దీనికి బాధ్యులైన అప్లికేషన్ పెట్టిన వారితో పాటు.. సర్టిఫికేట చేసిన కంప్యూటర్ ఆపరేటర్ తో సహా.. దాన్ని జారీ చేసిన అధికారి మీదా కేసు నమోదు చేశారు. ఈ ఉదంతంపై తనకు 24 గంటల్లోపు రిపోర్టు ఇవ్వాలని రెవెన్యూ ఉన్నతాధికారులు ఆదేశించారు. షాకింగ్ నిజం ఏమంటే.. కుక్కకు జారీ చేసిన సర్టిఫికేట్ మీద ఉన్న సంతకం సంబంధిత అధికారిదే కావటం చూస్తే.. ఇంత నిర్లక్ష్యమా? అని ముక్కున వేలేసుకునే పరిస్థితి. సర్టిఫికేట్ నెంబరు ఢిల్లీకి చెందిన ఒక మహిళదిగా గుర్తించారు. మొత్తంగా కుక్కకు నివాస ధ్రువీకరణ పత్రమేమో కానీ.. ప్రభుత్వానికి మాత్రం చెడ్డపేరును తీసుకొచ్చిందని చెప్పాలి.