గత సార్వత్రిక ఎన్నికల్లో ఘోర ఓటమి తర్వాత రాష్ట్రంలో వైసీపీ పరిస్థితి దారుణంగా మారింది. కనీసం ప్రతిపక్ష హోదా కూడా దక్కకపోవడంతో ఫ్యాన్ పార్టీ ఇమేజ్ డ్యామేజ్ అయింది. దీనికి తోడు వైసీపీ కీలక నేతలను వరుస కేసులు, అరెస్ట్‌లు వెంటాడుతున్నాయి. జగన్ కూడా అరెస్ట్ అవ్వొచ్చని ప్రచారం జరుగుతోంది. సరిగ్గా ఇదే సమయంలో జగన్ ఇలాఖా పులివెందులలో ఉప ఎన్నిక వచ్చింది.
పులివెందుల, ఒంటిమిట్ట జడ్పీటీసీ స్థానాల ఉపఎన్నికకు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ సోమవారం నోటిఫికేషన్ విడుదల చేశారు. జూలై 30వ తేదీ నుంచి ఆగస్టు 1వ తేదీ వరకు నామినేషన్ల స్వీకరణ, ఆగస్టు 2వ తేదీన నామినేషన్ల పరిశీలన ఉంటుంది. ఉపసంహరణకు ఆగస్టు 5వ తేదీ వరకు సమయం ఉంది. ఆగస్టు 12న పులివెందుల, ఒంటిమిట్ట జడ్పీటీసీ ఎన్నికల పోలింగ్ నిర్వహించనున్నారు. ఆగస్టు 14న కౌంటింగ్ నిర్వహిస్తారు.
కడప జిల్లా ఒంటిమిట్ట జడ్పీటీసీ స్థానానికి 2021లో ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి పోటీ చేసి గెలిచారు. అయితే మొన్నటి సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ తరఫున రాజంపేట అసెంబ్లీ టికెట్ దక్కడంతో ఆయన జడ్పీటీసీ పదవికి రాజీనామా చేశారు. దాంతో ఒంటిమిట్ట జడ్పీటీసీ స్థానానికి ఉప ఎన్నిక అనివార్యంగా మారింది. మరోవైపు జగన్ ప్రాతినిధ్యం వహిస్తున్న పులివెందుల మండలం జడ్పీటీసీ సభ్యులు మహేశ్వర్ రెడ్డి దాదాపు మూడేళ్ల క్రితం చోటుచేసుకున్న ఓ రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. దాంతో ఆ స్థానానికి సైతం ఉప ఎన్నిక అనివార్యంగా మారింది.
అయితే మొన్నటి ఎన్నికల్లో పులివెందులలో జగన్‌కు మెజారిటీ తగ్గింది. జిల్లాలో కూడా ఫ్యాన్ పార్టీ గట్టిగా దెబ్బతింది. ఈ నేపథ్యంలోనే కూటమి ప్రభుత్వం జగన్ ఇలాఖాలో దూకుడు పెంచింది. వైసీపీకి గట్టి పోటీ ఇచ్చి ఆ రెండు స్థానాల్లో గెలుపొందాలని కూటమి భావిస్తోంది. దీంతో జగన్ కు టెన్షన్ స్టార్ట్ అయింది. పులివెందులలో పట్టు నిలుపుకునేందుకు వైసీపీ కసరత్తులు ప్రారంభించింది. మరి ఈ ఉపఎన్నికల్లో ఫలితాలు ఎలా ఉంటాయో చూడాలి.