పాలాభిషేకం, జలాభిషేకం గురించి మనందరికీ తెలుసు. కానీ కారం నీళ్లతో అభిషేకం చేయడం ఎప్పుడైనా చూశారా? కనీసం విన్నారా? సాధారణంగా కూరలో కొంచెం కారం ఎక్కువైతేనే అల్లాడిపోతూ ఉంటాము. అలాంటిది తాజాగా ఓ గుడిలో కారం, పచ్చిమిరపకాయలు కలిపిన నీళ్లతో ఆలయ పూజారికి అభిషేకం చేశారు. తమిళనాడులో ఈ వింత ఆచారం వెలుగులోకి వచ్చింది. పూర్తి వివరాల్లోకి వెళ్తే..
తమిళనాడు రాష్ట్రం ధర్మపురి జిల్లా నడపనహళ్లీ గ్రామంలో ప్రతి ఏడాది ఆదివారం ఆది అమావాస్య రోజున గ్రామ దైవం పెరియ కరుప్పస్వామికి ఆలయంలో కారం, పాలతో అభిషేకం చేస్తారు. అలాగే గ్రామ దేవర కరుణ పొందేందుకు ఆలయ పూజారికి కూడా కారం నీళ్లతో అభిషేకం చేస్తారు. గురువారం ఆది అమావస్య రావడంతో పూజారి గోవిందన్‌కు 108 కిలోల కారం, ఆరు కిలోల పచ్చి మిరపకాయలు కలిపిన నీళ్లతో అభిషేకం చేశారు.
ఈ ప్రత్యేక అభిషేకంలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. ఈ వింత ఆచారం ఇప్పుడు ప్రారంభమైంది కాదు.. చాలా ఏళ్ల నుంచి కొనసాగుతోంది. ఆసక్తికర విషయం ఏంటంటే.. భక్తులు స్వామి వారికి మద్యం, సిగరెట్లు నైవేద్యంగా సమర్పిస్తారు. అలాగే కారం నీటితో అభిషేకం చేయించిన కూడా పూజారికి ఎటువంటి మంట పుట్టదట. నిజంగానే ఆలయ పూజారి గోవిందన్ ఎటువంటి ఇబ్బంది లేకుండా కారం నీటితో హాయిగా స్నానం చేశారు. ఇందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారాయి. వాటిని చూసి ఇదేం వింత ఆచారం రా బాబు అంటూ నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు.