ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన `హరిహర వీరమల్లు` రేపు పాన్ ఇండియా స్థాయిలో అట్టహాసంగా విడుదల కాబోతున్న సంగతి తెలిసిందే. బుధవారం రాత్రి నుంచే ప్రీమియర్ షోలు ప్రారంభం కాబోతున్నాయి. టికెట్ బుకింగ్స్ కూడా జోరందుకున్నాయి. ఇదిలా ఉంటే.. వీరమల్లు రిలీజ్ వేళ వైసీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబు తాజాగా చేసిన ఓ ట్వీట్ ఇప్పుడు వైరల్ గా మారింది.
నిజానికి వీరమల్లు విషయంలో వైసీపీ పవన్ కళ్యాణ్ ను గట్టిగా టార్గెట్ చేసింది. సొంత సినిమా కావడంతో టికెట్ రేట్లు భారీగా పెంచుకున్నారంటూ పవన్ పై ఫ్యాన్ పార్టీ నాయకులు ఏకేస్తున్నారు. ఇలాంటి తరుణంలో అంబటి రాంబాబు వీరమల్లు విషయంలో స్వరం మార్చారు. `పవన్ కళ్యాణ్ గారి హరిహర వీరమల్లు సూపర్ డూపర్ హిట్టై కనక వర్షం కురవాలని కోరుకుంటున్నాను` అని అంబటి ట్వీట్ చేశారు. పవన్ కళ్యాణ్, నాగబాబులను ట్యాగ్ కూడా చేశారు.
అంబటి చేసిన ఈ ట్వీట్ తో వైసీపీకి షాక్ తగిలినట్లు అయింది. మరోవైపు పవన్ ఫ్యాన్స్ అంబటికి సెటైరికల్‌గా రిప్లై ఇస్తున్నారు. ఓ నెటిజన్ `థ్యాంక్యూ తాత గారు.. మీరు కూడా సుకన్య సమేతంగా సినిమా చూసి ఆనందించాలి అని కోరుకుంటున్నాము` అని కామెంట్ చేయగా.. `ఈ మార్పు మంచిదే` అని మరొకరు కామెంట్ చేశారు. ఇంకో వ్యక్తి `నువ్వు కోరుకున్న, కోరుకోపోయినా మా పవన్ కళ్యాణ్ నటించిన హరి హర వీరమల్లు సూపర్ హిట్ అవుతుంది` అని రిప్లై ఇచ్చాడు. మరొక నెటిజన్ `రేపటి నుండి సినిమా ఫ్లాప్ ఫ్లాప్ అని మీడియా సమావేశం పెట్టీ మరీ రుద్దుతావు అనుకున్నా.. ఏంటి సడన్ గా ఇలా?వీలైనంత త్వరగా ట్వీట్ డిలీట్ చెయ్యి. ఎవరైనా వైసీపీ నేతలు చూస్తే, నిన్ను వేసుకుంటారు` అంటూ అంబటికి సలహా ఇవ్వడం విశేషం.