బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ మరియు ఆయన సోదరి, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత మధ్య ఉన్న అంతర్గత విభేదాలు ఇటీవల బహిర్గతమైన సంగతి తెలిసిందే. తన తండ్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కు కవిత లేఖ రాయడం, అది కాస్త లీక్ కావడం, అందులో కేటీఆర్ ను పరోక్షంగా విమర్శిస్తూ కవిత వ్యాఖ్యలు చేయడం పార్టీలోనే కాకుండా తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో పెను సంచలనం రేపింది. ఈ ఘటన తర్వాత కేటీఆర్, కవిత మధ్య గ్యాప్ పెరిగిందన్నది ఓపెన్ సీక్రెట్.
సొంత సోదరుడితో విభేదాలు, పార్టీలో తన పాత్ర రోజురోజుకు తగ్గడం వంటి పరిణామాల నడుమ సొంత రాజకీయ గుర్తింపు కోసం కవిత తెలంగాణ జాగృతి సంస్థను పటిష్టం చేసే పనిలో పడ్డారు. ఇదిలా ఉండగా.. నేడు కేటీఆర్ పుట్టినరోజు. జూలై 24వ తేదీతో ఆయన 49వ పడిలోకి అడుగుపెట్టారు. ఈ సందర్భంగా కేటీఆర్ కు సొంత పార్టీ నేతలు, కార్యకర్తలు, వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు సన్నిహితులు సోషల్ మీడియా వేదికగా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.
అయితే గత కొద్ది రోజుల నుంచి కేటీఆర్‌ను టార్గెట్ చేసుకుని పరోక్షంగా విమర్వలు గుప్పిస్తున్న కవిత నుంచి కూడా ఊహించని ట్వీట్ వచ్చింది. `అన్నయ్య.. మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే!` అంటూ కవిత ఆప్యాయంగా కేటీఆర్ కు విషెస్ చెప్పడం ప్రధాన్యత సంతరించుకుంది. కవిత ట్వీట్‌కు భారీ స్పందన వస్తోంది. నెటిజన్ల నుంచి భిన్న రకాల రియాక్షన్స్ వ్యక్తం అవుతున్నాయి. `ఒక్క మాటతో కొంతమంది పచ్చ ఛానల్ కి చెంప దెబ్బ కొట్టినట్లు అయింది. అన్నా చెల్లెల అనుబంధం ఎప్పటికీ ఇలాగే ఉండాలి` అని ఓ నెటిజన్ కామెంట్ చేయగా.. `నీది మంచి మనసు అక్క నీ పతనం కోరుకునేవాడి బాగు కోరుకుంటున్నావ్` అని మరొక నెటిజన్ కామెంట్ పెట్టాడు. `బాగానే యాక్టింగ్ చేస్తున్నారు కదా` అని ఇంకొక వ్యక్తి కవిత ట్వీట్‌పై సెటైర్ పేల్చడం గమనార్హం.