ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన పీరియాడిక్ యాక్షన్ ఫిల్మ్ `హరిహర వీరమల్లు` గురువారం తెలుగుతో పాటు తమిళ్, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో గ్రాండ్ రిలీజ్ కాబోతున్న సంగతి తెలిసిందే. క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో ఈ సినిమా ప్రారంభం కాగా.. జ్యోతికృష్ణ పూర్తి చేశారు. నిధి అగర్వాల్ హీరోయిన్‌గా నటించింది. ఏఎం రత్నం నిర్మించిన ఈ సినిమా భారీ అంచనాల నడుమ ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.
బుధవారం రాత్రి నుంచే తెలుగు రాష్ట్రాల్లో ప్రీమియర్ షోలు ప్రారంభం కాబోతున్నాయి. దీంతో థియేటర్స్ వద్ద పవన్ ఫ్యాన్స్ హంగామా షురూ అయింది. ఇక ఇదే తరుణంలో పవన్ సినిమాకు మంత్రి నారా లోకేష్ ప్రమోషన్ చేయడం హైలెట్ గా నిలిచింది. హరిహర వీరమల్లు చిత్రం బృందానికి ఎక్స్ వేదికగా బెస్ట్ విషెస్ తెలుపుతూ నారా లోకేష్ ప్రత్యేకంగా ఓ పోస్ట్ పెట్టారు.
`మా పవన్ అన్న సినిమా హరిహర వీరమల్లు విడుదల సందర్భంగా సినిమా నిర్మాణంలో పాలుపంచుకున్న బృందానికి అభినందనలు. పవర్ స్టార్ అభిమానుల్లాగే నేనూ సినిమా ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్నాను. పవనన్న, ఆయన సినిమాలు, ఆయన స్వాగ్ నాకు చాలా చాలా ఇష్టం. పవర్ స్టార్ పవర్ ఫుల్ పెర్ఫార్మెన్స్‌తో హరిహర వీరమల్లు అద్భుత విజయం సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను` అంటూ నారా లోకేష్ ట్వీట్ చేశారు. ఈ ట్వీట్ అటు పవర్ స్టార్ అభిమానుల్లో, ఇటు జనసైకుల్లో ఉత్సాహాన్ని నింపింది.