అమెరికా అధ్యక్షుడు ట్రంప్.. ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ మధ్య లొల్లి అంతకంతకూ ముదురుతున్న సంగతి తెలిసిందే. మొన్నటివరకు చెట్టాపట్టాలు వేసుకున్న ఈ ఇద్దరు.. ఇప్పుడు అందుకు భిన్నమైన వాతావరణం ఇద్దరి మధ్య చోటు చేసుకున్న వేళ.. రష్యా నుంచి ఊహించని ప్రకటన వెలువడింది. తమ దేశంలో పొలిటికల్ అసైలమ్ (రాజకీయ శరణార్థి’గా ఉంచుకునేందుకు మస్క్ కు అవకాశం ఇస్తామని రష్యా ప్రకటించింది.
స్టేట్ డూమా ఫెడరేషన్ కమిటీ ఛైర్మన్ దిమిత్రి నోవికోవ్ ఒక వార్తా సంస్థతో మాట్లాడిన సందర్భంలో ఒక విలేకరి అడిగిన ప్రశ్నకు స్పందించిన ఆయన ఊహించని ప్రకటన చేశారు. ‘ఎడ్వర్డ్ స్నోడెన్ మాదిరి మస్క్ కు రష్యాలో రాజకీయ శరణార్థిగా అవకాశం కల్పిస్తారా?’ అని మీడియా ప్రతినిధి ప్రశ్నించగా.. దిమిత్రి స్పందించారు. ‘‘మస్క్ పూర్తిగా భిన్నమైన ఆట ఆడతారని అనుకుంటున్నా. ఆయనకు రాజకీయ శరణార్థిగా ఉండాల్సిన అవసరం లేదు. ఒక వేళ అలా చేయాలనుకుంటే మాత్రం రష్యా సహకరిస్తుంది’’ అని వ్యాఖ్యానించారు.
ఇదే సందర్భంలో మరిన్ని వ్యాఖ్యలు చేశారు. తదుపరి ఎన్నికల్లో డెమోక్రాట్లు రావాలని మస్క్ కోరుకోవటం లేదని తాను అనుకుంటున్నట్లుగా చెప్పారు. ఇదే అంశంపై క్రెమ్లిన్ ప్రతినిధి దిమిత్రి పెస్కోవ్ మరోలా స్పదించారు. ట్రంప్.. మస్క్ మధ్య నెలకొన్న వివాదంపై జోక్యం చేసుకోవటానికి ఆయన నిరాకరించారు. అది అమెరికా సమస్య అని.. అందులో తాము జోక్యం చేసుకునే ఉద్దేశం లేదన్నారు. ట్రంప్ స్వయంగానే ఈ సమస్యను పరిష్కరించుకుంటారని తాను అనుకుంటున్నట్లుగా వ్యాఖ్యానించారు.