తెలుగులో పెద్ద పెద్ద సినిమాల్లో నటించి, బాగా సొమ్ము చేసుకున్న అనంతరం.. ఇక్కడ తమకు ఇచ్చిన పాత్రలు, తమను ప్రెజెంట్ చేసిన తీరు గురించి అభ్యంతరాలు వ్యక్తం చేయడం ద్వారా ఇటీవల జాన్వి కపూర్, రాధికా ఆప్టే తీవ్ర విమర్శలే ఎదుర్కొన్నారు. ‘పెద్ది’లో తన పాత్రను చూపించిన తీరు పట్ల కొంచెం తీవ్ర వ్యాఖ్యలే చేసింది జాన్వి.
ఇక రాధిక విషయానికి వస్తే.. తనకంటే ఎక్కువ వయసున్న బాలయ్యతో రొమాన్స్ చేయడం, ఇందులో మేనమామను పెళ్లాడే పాత్ర చేయడం పట్ల ఆమె విచారం వ్యక్తం చేసింది. ఐతే నటించినపుడు మౌనంగా ఉండి, ఆయా చిత్ర బృందాల మీద ప్రశంసలు కురిపించి.. ఇప్పుడు ఇలా ప్లేటు తిప్పడం ఏంటి అంటూ వారి మీద నెటిజన్లు మండిపడుతున్నారు. పాత్ర నచ్చనపుడు తిరస్కరించే అవకాశం ఉంది కదా అని ప్రశ్నిస్తున్నారు.
ఐతే సామాన్యులు మాత్రమే కాదు.. ఇప్పుడో హీరోయిన్ కూడా జాన్వి, రాధికల తీరును తప్పుబట్టింది. నార్త్, సౌత్ అని సినిమా ఇండస్ట్రీలను వేరు చేసి మాట్లాడ్డం.. సౌత్ సినిమాలోనే తప్పులు జరుగుతున్నట్లు మాట్లాడ్డం పట్ల ఆమె అభ్యంతరం వ్యక్తం చేసింది. జాన్వి, రాధిక తమ పాత్రలతో ఉన్న ఇబ్బందుల గురించి ధైర్యంగా మాట్లాడ్డాన్ని తాను ఆహ్వానిస్తానని.. కానీ వాళ్లు లేవనెత్తిన అభ్యంతరాలను మాత్రం తాను అంగీకరించనని ఆమె అంది.
తమ పాత్రల విషయంలో అంత ఇబ్బంది ఉన్నట్లయితే.. సింపుల్గా నో చెప్పి ఆ సినిమాల నుంచి బయటికి వచ్చేయొచ్చు కదా అని ఆమె ప్రశ్నించింది. ఎక్కువ వయసున్న హీరోల సరసన చిన్న అమ్మాయిలు నటించడం కొత్తేమీ కాదని ఆమె అంది. ఇక తనకు బాలీవుడ్లో ఎదురైన చేదు అనుభవం గురించి రెజీనా మాట్లాడింది. కరణ్ జోహార్ నిర్మించిన ‘కేసరి-2’ సినిమాలో తాను నటించానని, ఒక ఫుల్ సాంగ్ కూడా చేశానని.. కానీ తనను ప్రమోషన్లకు పూర్తిగా దూరం పెట్టారని.. సోషల్ మీడియా పోస్టుల్లో కూడా తన పేరును వాడలేదని.. మరి దీనికేమంటారని ఆమె ప్రశ్నించింది.