పెద్ద సినిమాలు పదే పదే రిలీజ్ డేట్లు మార్చడం వల్ల చిన్న సినిమాలు పడే ఇబ్బందుల గురించి ఇటీవల పెద్ద చర్చే జరుగుతోంది. ముఖ్యంగా విక్టరీ వెంకటేష్, త్రివిక్రమ్ శ్రీనివాస్‌ల ‘ఆదర్శ కుటుంబం’కు డేట్లు మార్చడం వల్ల చాలా సినిమాలే ప్రభావితం అయ్యాయి. అందులో ‘సమ్మర్ హాలిడేస్’ కూడా ఒకటి. ముందు దసరాకు ఈ చిత్రాన్ని రిలీజ్ చేద్దామనుకుంటే.. పెద్ద సినిమాలతో పోటీ పడాల్సి ఉండడంతో అక్టోబరు 30కి ఈ చిత్రాన్ని వాయిదా వేసుకున్నారు. కానీ ఇప్పుడు ఆ డేటుకి ‘ఆదర్శ కుటుంబం’ ఫిక్స్ కావడంతో మళ్లీ వాయిదా తప్పలేదు.
ఇప్పుడు దీపావళి వీకెండ్లో సినిమాను రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నాడు నిర్మాత ధీరజ్ మొగిలినేని. ఐతే దీపావళికి ‘రామాయణం’ లాంటి భారీ చిత్రం బరిలో ఉంది. అది ఇబ్బంది కాదా అని అడిగితే.. ధీరజ్ క్రేజీ ఆన్సర్ ఇచ్చాడు. వెంకీ చేతిలో చావడం కంటే హిందీ మూవీ చేతిలో చావడం బెటర్ కదా అంటూ ఆయన తన నిస్సహాయతను తెలియజేశాడు.
ఆదర్శ కుటుంబం, రామాయణం చిత్రాల్లో దేంతో పోటీ పడితే బెటర్ అని ఆలోచించి.. దీపావళి పోటీనే మంచిదని తమ సినిమాను వాయిదా వేసుకున్నట్లు ధీరజ్ తెలిపాడు. వెంకీ, త్రివిక్రమ్ ఇద్దరూ తెలుగు ప్రేక్షకులకు ఇష్టమైన వ్యక్తులని.. వీకెండ్లో వీరి సినిమాకే జనాలు వస్తారని, వేరే మూవీకి స్పేస్ ఉండదని.. సోమవారం నుంచి థియేటర్‌కు జనాలు రారని ధీరజ్ అన్నాడు.
రామాయణం పెద్ద సినిమానే అయినప్పటికీ, అది హిందీ మూవీ కాబట్టి కొంత మనకు స్పేస్ ఉంటుందని భావించి తమ సినిమాను దానికి పోటీగా తీసుకొస్తున్నట్లు ధీరజ్ తెలిపాడు. ఈ క్రమంలోనే.. ‘‘వీడి చేతిలో చావడం కంటే వాడి చేతిలో చావడం బెటర్’’ అనే కామెంట్ చేశాడు ధీరజ్. అక్టోబరు 30న రావాల్సిన వేరే సినిమాలను కూడా దీపావళికి వాయిదా వేసే ఆలోచన చేస్తున్నట్లు జరుగుతున్న ప్రచారం గురించి మాట్లాడుతూ.. అలా చేయొద్దని వాటి మేకర్స్‌కు విజ్ఞప్తి చేస్తున్నట్లు తెలిపాడు ధీరజ్.
ఇక పెద్ద సినిమాల నిర్మాతలు డేట్లు మార్చడం వల్ల తలెత్తుతున్న ఇబ్బందుల గురించి ధీరజ్ మాట్లాడుతూ.. ఇండస్ట్రీలో కమ్యూనికేషన్ గ్యాప్ కంటే నిజాలు ఎవ్వరూ చెప్పకపోవడమే సమస్య అని చెప్పాడు. పెద్ద సినిమాల నిర్మాతల మధ్య కమ్యూనికేషన్ బాగానే ఉంటోందని.. కానీ చిన్న సినిమాల గురించే వాళ్లు పట్టించుకోవట్లేదని ధీరజ్ అన్నాడు. అక్టోబరు 9 నుంచి ‘ఆదర్శ కుటుంబం’ను వాయిదా వేశాక 16న రిలీజ్ చేయొచ్చని, కానీ అప్పుడు పెద్ద సినిమాలు ఉన్నాయి కాబట్టే ఈ చిత్రాన్ని 30కి తీసుకెళ్లారని.. కానీ ఆ రోజు వస్తున్న చిన్న సినిమాల గురించి మాత్రం పట్టించుకోలేదన.. పెద్ద పెద్ద సినిమాలు చేసేవాళ్లు పెద్ద మనసు చేసుకుని సరిగ్గా ప్లాన్ చేసి వేరేవాళ్లకు కూడా స్పేస్ ఇవ్వాలని ధీరజ్ అభిప్రాయపడ్డాడు. వెంకటేష్ సినిమాకు నాలుగు రోజుల ముందు రిలీజ్ డేట్ అనౌన్స్ చేసినా జనాలు వచ్చేస్తారని.. కానీ తమ పరిస్థితి అలా ఉండదని.. 30న రిలీజ్ అని డబ్బులు ఖర్చు పెట్టుకుని పబ్లిసిటీ చేశామని, ఇప్పుడు డేట్ మార్చడంతో మళ్లీ అప్పు తెచ్చుకుని పబ్లిసిటీ చేసుకోవాల్సి వస్తోందని ధీరజ్ ఆవేదన వ్యక్తం చేశాడు.