టాలీవుడ్(Tollywood)లో తనదైన నటనతో 'స్వీటీ'గా కోట్లాది మంది అభిమానులను సంపాదించుకుంది అనుష్క శెట్టి. గ్లామర్ పాత్రలకే పరిమితం కాకుండా, 'అరుంధతి', 'భాగమతి' వంటి చిత్రాలతో బాక్సాఫీస్ వద్ద లేడీ సూపర్ స్టార్‌గా తన సత్తా చాటింది. అయితే గత కొంతకాలంగా వెండితెరపై తక్కువగా కనిపిస్తున్న ఈ బ్యూటీ, ఇప్పుడు తన వ్యక్తిగత నిర్ణయాలతో వార్తల్లో నిలుస్తోంది. తాజాగా హైదరాబాద్‌లోని అత్యంత ఖరీదైన జూబ్లీహిల్స్ ప్రాంతంలో ఉన్న తన విలాసవంతమైన నివాసాన్ని అనుష్క విక్రయించినట్లు ఇండస్ట్రీలో జోరుగా ప్రచారం జరుగుతోంది. దాదాపు 12 కోట్లు విలువ చేసే ఈ ప్రాపర్టీకి డీల్ కుదిరిందన్న వార్త ఇప్పుడు ఫిలింనగర్ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది.
కెరీర్ పీక్స్‌లో ఉన్నప్పుడు షూటింగ్‌ల సౌలభ్యం కోసం భాగ్యనగరంలో స్థిరపడ్డ అనుష్క, ఇప్పుడు సడెన్‌గా ఇల్లు అమ్మేయడం వెనుక బలమైన కారణమే ఉందన్న చర్చ నడుస్తోంది. ముఖ్యంగా ఆమె త్వరలోనే పెళ్లి పీటలెక్కబోతున్నారంటూ గత కొన్ని రోజులుగా వస్తున్న ఊహాగానాలకు ఈ ఇంటి అమ్మకం మరింత బలాన్నిస్తోంది. వివాహం తర్వాత భర్తతో కలిసి విదేశాల్లో సెటిల్ అయ్యేందుకే ఇక్కడి ఆస్తులను వదులుకుంటోందని వార్తలు వస్తున్నాయి. మరోవైపు, హైదరాబాద్(Hyderabad) రణగొణధ్వనులకు దూరంగా ప్రశాంతమైన జీవితం గడిపేందుకు తన సొంతూరు మంగళూరుకు శాశ్వతంగా మకాం మారుస్తున్నారనే వాదన కూడా వినిపిస్తోంది.
అయితే, ఈ ప్రచారాలపై అనుష్క(Anushka) సన్నిహిత వర్గాల నుంచి మరో ఆసక్తికరమైన సమాచారం అందుతోంది. ఆర్థిక అవసరాల కోసమో లేక ఇండస్ట్రీని వదిలి వెళ్లిపోవాలనో ఆమె ఈ నిర్ణయం తీసుకోలేదని తెలుస్తోంది. కేవలం తన నివాస స్థలాన్ని మార్చుకోవాలనే ఉద్దేశంతోనే జూబ్లీహిల్స్ ఇంటిని అమ్మేశారని, త్వరలోనే నగరంలోని మరో ప్రశాంతమైన ఏరియాలో కొత్త ఇంటిని కొనుగోలు చేసే ప్లాన్‌లో ఉన్నారని సమాచారం. కానీ ఈ రకరకాల ప్రచారాలపై ఎటువంటి అధికారిక సమాచారం లేదు. మరి ప్రస్తుతం మలయాళంలో 'కథనార్' వంటి భారీ ప్రాజెక్ట్‌తో పాటు తెలుగులోనూ కొత్త కథలు వింటున్న స్వీటీ, నిజంగా విదేశాలకు వెళ్లిపోయి సెటిల్ కాబోతుందా..? అందుకే హైదరాబాద్ ఇంటిని అమ్మేసిందా..? అన్న ప్రశ్నలకు కాలమే సమాధానం చెప్పాలి.