సూపర్‌స్టార్ రజనీకాంత్(Superstar Rajinikanth) కుటుంబం నుంచి మరొకరు ప్రత్యక్ష రాజకీయాల్లోకి అడుగుపెట్టే అవకాశం ఉందనే ప్రచారం ప్రస్తుతం జాతీయ రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. తలైవా సతీమణి లతా రజనీకాంత్ త్వరలోనే పార్లమెంటు ఉభయసభల్లో ఒకటైన రాజ్యసభకు నామినేట్ కానున్నారనే ఊహాగానాలు తమిళనాడుతో పాటు ఢిల్లీ రాజకీయాల్లోనూ తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. కళ, సాహిత్యం, శాస్త్ర విజ్ఞానం, సామాజిక సేవ వంటి రంగాల్లో విశేష కృషి చేసిన ప్రముఖులను రాష్ట్రపతి కోటా కింద పెద్దల సభకు ఎంపిక చేసే సంప్రదాయం ఉన్న విషయం తెలిసిందే. ఈ కోటాలోనే లతా రజనీకాంత్‌కు స్థానం కల్పించే దిశగా కషాయ పార్టీ వర్గాలు పావులు కదుపుతున్నట్లు తెలుస్తోంది.
ఈ ఊహాగానాలకు బలం చేకూరుస్తూ, లతా రజనీకాంత్(Latha Rajinikanth) స్వయంగా రంగంలోకి దిగినట్లు వార్తలు వస్తున్నాయి. తన ఆధ్వర్యంలో దశాబ్దాలుగా నడుస్తున్న విద్యా సంస్థలు, వివిధ స్వచ్ఛంద, సామాజిక సేవా కార్యక్రమాలను ప్రాతిపదికగా తీసుకుని, తనను రాజ్యసభకు నామినేట్ చేయాల్సిందిగా ఆమె కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌ను కలిసి విజ్ఞప్తి చేసినట్లు రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. కేవలం ఒక్కరితోనే కాకుండా, రాబోయే రోజుల్లో మరికొంత మంది కేంద్ర కేబినెట్ అగ్రనేతలను కూడా ఆమె కలవడానికి ఏర్పాట్లు చేసుకుంటున్నట్లు తెలుస్తోంది.
దక్షిణాదిలో, ముఖ్యంగా ద్రావిడ రాజకీయాలకు పుట్టినిల్లైన తమిళనాడులో తన పట్టును పటిష్టం చేసుకోవాలని భారతీయ జనతా పార్టీ ఎప్పటినుంచో వ్యూహాలు రచిస్తోంది. రజనీకాంత్ గతంలో ప్రత్యక్ష రాజకీయాల్లోకి వస్తారని విస్తృతంగా ప్రచారం జరిగి, చివరి నిమిషంలో ఆయన పలు కారణాల దృష్ట్యా అనూహ్యంగా వెనకడుగు వేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు తలైవా కుటుంబం నుంచి లతా రజనీకాంత్ ద్వారా పార్లమెంటరీ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇప్పించడం ద్వారా రాష్ట్రంలో రాజకీయ సమీకరణాలను తమకు అనుకూలంగా మార్చుకోవచ్చని బీజేపీ(BJP) హైకమాండ్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. రజనీకాంత్ కుటుంబానికి రాష్ట్రంలో ఉన్న సానుకూల వాతావరణాన్ని తమ రాజకీయ లబ్ధికి ఉపయోగించుకోవాలనేది ఆ పార్టీ వ్యూహంగా కనిపిస్తోంది.
ఒకవేళ ఈ ప్రచారం నిజమైతే, రజనీకాంత్ కుటుంబం నుంచి రాజకీయాల్లోకి రాబోతున్న తొలి వ్యక్తిగా లతా రజనీకాంత్ చరిత్ర సృష్టించనున్నారు. తద్వారా తమిళనాడు(Tamil Nadu) రాజకీయాల్లో రాబోయే ఎన్నికల నాటికి కొత్త సమీకరణాలు తెరపైకి వచ్చే అవకాశం కూడా ఉంది. మరి కేంద్ర పెద్దల నుంచి దీనిపై ఎలాంటి అధికారిక స్పందన వస్తుంది, లతా రజనీకాంత్ రాజ్యసభ ప్రయాణం ఏ రూపం దాలుస్తుంది అనేది వేచి చూడాలి.